PSLV C-52: పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం సక్సెస్... ఇస్రోలో సంబరాలు

  • ఈ ఉదయం నింగికి ఎగిసిన రాకెట్
  • మూడు ఉపగ్రహాలను కక్ష్యలో చేర్చిన వైనం
  • హర్షం వ్యక్తం చేసిన ఇస్రో సైంటిస్టులు
PSLV launched earth observation satellite successfully

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఉదయం చేపట్టిన పీఎస్ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఉదయం 5.59 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది.

ఈ ఉపగ్రహాల్లో భూ పరిశీలన శాటిలైట్ ఈఓఎస్-04 కూడా ఉంది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తున సోలార్ సింక్రోనస్ ఆర్బిట్ లో సజావుగా ప్రవేశపెట్టారు. ఈ శాటిలైట్ బరువు 1,710 కేజీలు. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ భూమిని అత్యంత స్పష్టతతో చిత్రీకరించగలదు. ఇది ప్రధానంగా వ్యవసాయం, అటవీశాఖ, ఉద్యానవనాలు, భూమిలో తేమ, జలవనరులు, వరదలు వంటి అంశాల్లో విశేషంగా తోడ్పాటు అందిస్తుంది.

కాగా, మిగిలిన రెండు ఉపగ్రహాలు చిన్నవి. వీటిలో ఒకటి స్టూడెంట్ శాటిలైట్ కాగా, మరొకటి టెక్నాలజీ డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్. ఈ డెమాన్ స్ట్రేటర్ శాటిలైట్ ను గతంలో ప్రయోగించిన ఇండియా-భూటాన్ సంయుక్త ఉపగ్రహం ఐఎన్ఎస్-2బీకి కొనసాగింపుగా ప్రయోగించారు.

పీఎస్ఎల్వీ సి-52 విజయంతో ఇస్రోలో సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి.

More Telugu News