Kanakamedala Ravindra Kumar: హోదాపై వైసీపీ కార్యాచరణ ఏంటో చెబితే మద్దతు ఇస్తాం: టీడీపీ నేత కనకమేడల

Kanakamedala Ravindrakumar opines on special statues issue
  • హోదా అంశంపై కనకమేడల వ్యాఖ్యలు
  • కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని వైసీపీపై విమర్శలు
  • వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న కనకమేడల
  • టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని వెల్లడి
ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే తాము కూడా మద్దతిస్తామని టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. అజెండాలో ప్రత్యేకహోదా అంశం పెట్టకపోవడం ఏంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారుకు కేంద్రంతో ఉన్న ఒప్పందం ఏంటో చెప్పాలని నిలదీశారు. అజెండా మారడానికి కేంద్రానికి సీఎం జగన్ రాసిన లేఖనే కారణమని భావిస్తున్నట్టు కనకమేడల తెలిపారు. వైసీపీకి 28 ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ప్రభుత్వానిది వైఫల్యమా? లొంగుబాటా? అని ప్రశ్నించారు.

అసలు, వైసీపీ తీరుపై సందేహాలు కలుగుతున్నాయని, అజెండాలో హోదా అంశం ఎవరు చెబితే తొలగించారని వ్యాఖ్యానించారు. హోదాపై మంచి పరిణామం ఎదురైతే వైసీపీకి, చెడు పరిణామం ఎదురైతే చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని కనకమేడల ఆరోపించారు.

కేంద్రం హోదా ఇవ్వకపోతే వైసీపీ కార్యాచరణ ఏంటో చెప్పాలని అన్నారు. హోదాపై ఏవిధంగా ముందుకు పోదలుచుకున్నారో చెబితే, అందుకు టీడీపీ కూడా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ పోరాడితే టీడీపీ నేతలు కూడా కలిసి వస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, వారితో పాటు తాము కూడా రాజీనామాలు చేస్తామని కనకమేడల వెల్లడించారు. ఒకవేళ, హోదా సాధించడం వైసీపీ వల్ల కాదని జగన్ చెబితే, టీడీపీ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Kanakamedala Ravindra Kumar
AP Special Status
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News