Wheel Chair: దివ్యాంగురాలిని చూస్తే కస్టమర్లు డిస్టర్బ్ అవుతారట.. వీల్ చైర్ లో యువతిని లోపలికి రానివ్వని రెస్టారెంట్ సిబ్బంది

  • రెండు మూడు సార్లు అడిగినా స్పందించలేదన్న బాధితురాలు
  • బయట టేబుల్ వేయించారని ఆవేదన
  • తమనెందుకు వేరు చేయాల్సి వచ్చిందనని నిలదీత
  • వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పిన రెస్టారెంట్ ఓనర్
Restaurant Denies Entry For Divyang Young Lady In Wheel Chair

వీల్ చైర్ లో ఉందన్న కారణంతో ఓ యువతిని రెస్టారెంట్ సిబ్బంది లోపలికి రానివ్వలేదు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని గుర్గావ్ లో శుక్రవారం సాయంత్రం జరిగింది. సృష్టి అనే దివ్యాంగురాలైన యువతి తన స్నేహితురాలి ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లింది. ఆ వివరాలను వెల్లడిస్తూ సృష్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో ఆమె మాటల్లోనే..

‘‘నా బెస్ట్ ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి గుర్గావ్ లోని రాస్తా అనే పెద్ద రెస్టారెంట్ కు వెళ్లాం. ఎన్నో రోజుల తర్వాత తొలిసారిగా నేను వెళ్లిన ఔటింగ్ అది. రెస్టారెంట్ లో ఓ టేబుల్ కోసం నా ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య రిక్వెస్ట్ చేశాడు. రెండు సార్లు అడిగినా రెస్టారెంట్ సిబ్బంది స్పందించలేదు. మూడోసారికి గానీ స్పందించలేదు.

అప్పుడు కూడా వీల్ చెయిర్ లోపలికి వెళ్లదని ఒక సిబ్బంది చెప్పారు. అయితే, వీల్ చెయిర్ గురించేమో అనుకున్నాం. మేం మేనేజ్ చేసుకుంటామని చెప్పాం. ఆ తర్వాత వారు చెప్పిన సమాధానానికి మేం షాకయ్యాం. నా వైపు చూపిస్తూ.. లోపలికి వెళ్తే కస్టమర్లు డిస్టర్బ్ అవుతారని చెప్పారు. అది విని మేం ఒక్కసారిగా కంగుతిన్నాం. చాలా సేపు వాదించాక మాకు బయట టేబుల్ వేయించారు.

ఫస్ట్ మాకు బయట టేబుల్ వేయించడమేంటి? అప్పుడే చల్లబడుతోంది. నా శరీరం చలిని తట్టుకోలేదు. బిగుసుకుపోయినట్టు అవుతుంది. నాకు మంచిది కాదు. అయినా, నేను మిగతా వాళ్లలాగా లోపల కాకుండా బయట ఎందుకు కూర్చోవాలి? నన్నెందుకు వేరు చేసినట్టు? ఒకవేళ బయట సీటింగ్ కావాలనుకుంటే.. మేమే అడిగి ఉండేవాళ్లం కదా.

సరే.. నేను లోపలికి వస్తే మీకు అంత డిస్టర్బెన్స్ గా ఉందా? చిన్న చిన్న విషయాల కోసమే నేను ఎందుకు ఫైట్ చేయాలి? బహిరంగ ప్రదేశాల్లో నన్నెందుకు రానివ్వరు? నేను రావొద్దనడానికి మీరెవరు? దివ్యాంగురాలినని, అందరిలాంటిదాన్ని కాదని నేను బయటకు వెళ్లకుండా ఉండాలా? నేను దివ్యాంగురాలినైతే ఇతరుల మూడ్ డిస్టర్బ్ అవుతుందా? ఇవన్నీ అనుభవించిన నాకు గుండె ముక్కలైనట్టనిపిస్తోంది. చాలా బాధగా ఉంది’’ అని ప్రశ్నలు సంధిస్తూ సృష్టి ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ఆవేదనపై రెస్టారెంట్ ఓనర్ గౌమతేశ్ సింగ్ స్పందించారు. జరిగిన అవమానానికి, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు. తాము సమ్మిళితతత్వాన్నే నమ్ముతామన్నారు. ఏదో ఒక కారణం చేత ఎవ్వరినీ ఒంటరిని చేయాలన్నది తమ విధానం కాదని చెప్పారు. ఇలా మాట్లాడిన వారితో వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పిస్తామని తెలిపారు. తాము వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నామన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఎదుటివారిపై సిబ్బంది మంచిగా ప్రవర్తించేలా, కొంచెం దయాగుణాన్ని పెంపొందించుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

More Telugu News