CM KCR: రాహుల్ గాంధీపై అసోం సీఎం తీవ్ర వ్యాఖ్యలు... మండిపడిన సీఎం కేసీఆర్

  • సర్జికల్ దాడులపై ఆధారాలు చూపాలన్న రాహుల్
  • రాజీవ్ కొడుకువే అనడానికి ఆధారాలేంటన్న అసోం సీఎం
  • అసోం సీఎంను బర్తరఫ్ చేయాలన్న కేసీఆర్
  • కళ్లు నెత్తికెక్కాయా? అంటూ ఆగ్రహం
CM KCR condemns Assam CM remarks on Rahul Gandhi

పాకిస్థాన్ భూభాగంలో భారత్ సర్జికల్ దాడులు జరిపితే అందుకు ఆధారాలు చూపించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, బీజేపీ నేత, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వు నిజంగానే రాజీవ్ గాంధీకే పుట్టావా? అని మేమెప్పుడైనా ఆధారాలు అడిగామా? అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అంతేకాదు, రాహుల్ గాంధీని 'ఆధునికతరం జిన్నా' అని అభివర్ణించారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసోం సీఎం వ్యాఖ్యలను ఖండించారు. "రాహుల్ గాంధీ వాళ్ల నానమ్మ, నాన్న దేశం కోసం పనిచేస్తూ చనిపోయారు. వాళ్ల తాత స్వతంత్ర పోరాటం చేసి దేశానికి ప్రధానిగా వ్యవహరించాడు. ఆ పిలగాడు (రాహుల్ గాంధీ) కూడా ఇవాళ ఎంపీగా ఉన్నాడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలపై ప్రజల తరఫున ప్రజాప్రతినిధులు కూడా నిలదీస్తారు.

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి, పెద్ద పార్టీ నేత కాబట్టి దేశానికి సంబంధించిన అంశం ఏదో అడిగాడు. దానికి అసోం ముఖ్యమంత్రి ఏమంటాడు? నువ్వు ఏ అయ్యకు పుట్టావో మేం అడిగామా? అని అంటాడు. ఇదేనా బీజేపీ సంస్కారం? అడగొచ్చా ఈ మాట? మోదీ, నడ్డా సమాధానం చెప్పగలరా? అసోం సీఎం వ్యాఖ్యలతో నా కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. ఇదేనా హిందూ ధర్మం? ఓపికకు కూడా హద్దులుంటాయి. ఏం తమాషా చేస్తున్నారా? అహంకారమా? ఏం, కళ్లు నెత్తికెక్కాయా? ఆ అసోం సీఎంను బర్తరఫ్ చేయండి. ఎవరికి అన్యాయం జరిగినా మేం ప్రశ్నిస్తాం. తెలంగాణ గడ్డలోనే ఆ పౌరుషం ఉంది" అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగేలా ప్రసంగించారు.

More Telugu News