Chandrababu: మూడేళ్లు చేసిన జగన్ కే అంతుంటే 14 ఏళ్లు చేసిన నాకెంత ఉండాలి?: చంద్రబాబు

  • సీఐడీ కేసులో అశోక్ బాబుకు బెయిల్
  • అశోక్ బాబు నివాసానికి వెళ్లిన చంద్రబాబు
  • వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం
  • టీడీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం
Chandrababu visits MLC Ashok Babu at his home

సీఐడీ కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన ఎమ్మెల్సీ అశోక్ బాబును టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్యాహ్నం పరామర్శించారు. అశోక్ బాబును అడిగి కేసు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపైనా, సీఎం జగన్ పైనా నిప్పులు చెరిగారు. సీఐడీ అధికారులు అతిగా ప్రవర్తించారని మండిపడ్డారు. అశోక్ బాబుపై కక్షగట్టి కేసులు పెట్టారని ఆరోపించారు.

ఇవాళ టీడీపీ శ్రేణులు బాధపడినట్టే, రేపు వైసీపీ వాళ్లు కూడా బాధపడతారని, రేపన్నది ఒకటుంటుందని మరువరాదని హెచ్చరించారు. 4 వేల మందిపై కేసులు పెట్టారని, ముగ్గురు మాజీ మంత్రులను, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలను, బీటెక్ రవి వంటి వ్యక్తులను, నియోజకవర్గ ఇన్చార్జిలను 80 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. 33 మందిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బతీసేలా ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని అన్నారు.

అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్ట్ చేశారు... ఇలాంటివి మేం చేయించలేకనా? మూడేళ్లకే జగన్ కు అంతుంటే 14 ఏళ్లు చేసిన నాకెంత ఉండాలి? అని ఆగ్రహం వెలిబుచ్చారు. 'సమస్యలు వీళ్లే సృష్టించి, వీళ్లే పరిష్కరించినట్టు నటించి అందరితో బలవంతంగా జేజేలు కొట్టించికుంటున్నారు' అని విమర్శించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించారు. వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో మొద్దు శ్రీను హత్య జరిగినప్పుడు అనంతపురం జైలర్ గా ఉన్న వరుణ్ రెడ్డిని ప్రస్తుతం కడప జైలర్ గా నియమించారని వివరించారు. కడప జైలర్ గా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News