YS Jagan: సినిమా టికెట్ల కోసం కేటాయించిన సమయాన్ని అమరావతి రైతుల కోసం ఎందుకు కేటాయించరు?: జగన్‌పై నాదెండ్ల ఫైర్

Jana Sena Leader Nadendla Manohar Slams YS Jagan
  • సినీ పరిశ్రమను విశాఖకు ఆహ్వానించినప్పుడు అమరావతి గుర్తు రాలేదా?
  • జగన్ విచిత్ర ధోరణి, కపట మనస్తత్వానికి ఇది పరాకాష్ఠ 
  • సీఎం రిలీఫ్ ఫండ్‌లో రూ. వందల కోట్ల స్కామ్ ఎలా జరిగింది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమా టికెట్ల సమస్యపై కేటాయించిన సమయాన్ని అమరావతి రైతులు, గోతులమయమైన రహదారులు, రోడ్డెక్కిన రైతాంగం కోసం ఎందుకు కేటాయించరని ప్రశ్నించారు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిన్న విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో సినీ పరిశ్రమ ఏర్పాటుకు ఆహ్వానించినప్పుడు అమరావతి గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. సమస్యలను సృష్టించి, దానిని జటిలం చేసి చివరకు బతిమాలుకునే పరిస్థితికి తీసుకురావడం, ఆపై పబ్లిసిటీ స్టంట్ వంటివి జగన్‌కే చెల్లిందని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ విచిత్ర ధోరణికి, కపట మనస్తత్వానికి ఇది అద్దంపడుతోందన్నారు. సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామన్యుడి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా లేక రైతులు రోడ్లపైకి వస్తున్నారని, ఇసుక పాలసీ, విద్య, వైద్య సమస్యలపై ఎప్పుడైనా చర్చించారా? అని జగన్‌ను ప్రశ్నించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌లో వందల కోట్ల రూపాయల కుంభకోణం ఎలా జరిగిందని ప్రశ్నించారు. టిడ్కో గృహాల నుంచి జగనన్న కాలనీల లే అవుట్ల వరకు త్వరలోనే అన్నీ పరిశీలిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

  • Loading...

More Telugu News