Visakhapatnam: పోలీసులంటే అంత లోకువా సార్.. చొక్కా విప్పి కొడతానంటారా?: వైరల్ అవుతున్న విశాఖ ఏఎస్సై వాయిస్ రికార్డ్

  • సీఐని దుర్భాషలాడడంపై తీవ్ర ఆవేదన
  • పోలీసులంటే అందరికీ లోకువేనా సర్? అని ప్రశ్న
  • మా పై అధికారుల ఆదేశాలు పాటించడం కూడా తప్పేనా?
  • అప్పట్లో ఓ ఎంపీ ఎవడ్రా వాడు అన్నారు
  • దుస్తులు విప్పి కొడతామంటరా?
  • వాయిస్ రికార్డులో మహిళా ఎస్సై ఆవేదన
woman ASI Voice record on minister seediri appalaraju viral

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ శారదా పీఠం సందర్శన సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు సీఐని దుర్భాషలాడిన ఘటనపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విధుల్లో ఉన్న తమ పై అధికారిని ప్రజాప్రతినిధి దుర్భాషలాడడంపై విశాఖకు చెందిన ఓ మహిళా ఏఎస్సై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వాయిస్ రికార్డును విడుదల చేశారు.

 ‘సార్ నమస్తే’ అంటూ ప్రారంభించిన ఆ ఆడియోలో.. పోలీసులంటే అందరికీ లోకువేనా సర్? అని ప్రశ్నించారు. మీతో మాట్లాడాలన్నా తనకు ఏడుపు వస్తోందని అన్నారు. ప్రతిసారి పోలీసులను బూతులు తిట్టడమేనా? అని ప్రశ్నించారు. సీఎం ప్రొటోకాల్ ఎంతో కష్టంగా ఉంటుందని పేర్కొన్నారు.

మా విధులు మేం నిర్వర్తించడం కూడా తప్పేనా? అని నిలదీశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిపై అలా తిరగబడడం కరెక్టేనా? అన్నారు. మీ బందోబస్తు కోసం ఉదయం నుంచే రోడ్లపై పడిగాపులు పడుతుంటామన్నారు. పై అధికారుల ఆదేశాలను పాటించడం కూడా తప్పేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంత రాజకీయ నాయకుడైతే మాత్రం పోలీసు ఉద్యోగిపై నోరు పారేసుకుంటారా? పోలీసు వ్యవస్థ మరీ ఇంతగా దిగజారిపోయిందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గతంలో తొలిసారి శారదాపీఠానికి వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఓ వ్యక్తిని లోపలకు పంపలేదని, అప్పుడు ఓ ఎంపీ వచ్చి ఎవడ్రా లోపలకు పంపలేదు? అన్నారని ఆమె గుర్తు చేశారు. ఇలా అనడం కరెక్టేనా? అన్నారు. అప్పుడు కూడా తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. కష్టపడి శిక్షణ తీసుకుని రోడ్లపై ఉద్యోగాలు చేస్తుంటే ఎవడ్రా.. వాడు.. వీడు అంటారా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎండనక, వాననక కష్టపడి పనిచేస్తుంటే దుస్తులు ఊడిదీసి కొడతామంటారా? యూనిఫాంలో ఉన్న అధికారిని చేయి పట్టుకుని పక్కకు తోసేస్తారా? ఇది కరెక్టేనా? అన్నారు. ఇంకెవరైనా అయితే ఊరుకుంటారా? ఒకవేళ ఆ అధికారి తప్పుచేస్తే కమిషనర్‌కు ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. సీఐని దుర్భాషలాడిన విషయం సీఎం దృష్టికి వెళ్లిందో, లేదో తనకు తెలియదని, ఒకసారి పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేదు, ఆయన చేసింది కరెక్టే అయితే వదిలేయాలని కోరారు. తాను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పుంటే క్షమించాలని కోరారు.

More Telugu News