Rahul Gandhi: సమతా విగ్రహాన్ని చైనాలో తయారు చేయించడం ఏమిటన్న రాహుల్ గాంధీ.. కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి!

Congress leader Rahul Gandhi Counters Atmanirbhar Bharat
  • ఆత్మ నిర్భర్ భారత్ అంటే చైనాపై ఆధారపడడం అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు 
  • నవభారత్ అంటే చైనాపై ఆధారపడడమేనంటూ విమర్శ  
  • ఎనిమిదేళ్ల క్రితమే విగ్రహం తయారీ ప్రారంభమైందన్న కిషన్ రెడ్డి 
  • అప్పుడు కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్సే అధికారంలో ఉందంటూ దెప్పిపొడుపు  
బీజేపీ ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుమ్మెత్తి పోశారు. ఆ పార్టీ మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది ఆత్మనిర్భర్ భారత్ కాదని, ‘చైనా నిర్భర్’ అని విమర్శించారు.

హైదరాబాద్‌ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుడి సమతా విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల దానిని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చైనాలో తయారుచేయించడంపై రాహుల్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమతా విగ్రహం చైనాలో తయారైందని, నవభారత్ అంటే చైనాపై ఆధారపడడమేనంటూ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాహుల్ విమర్శలపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. ఈ వ్యాఖ్యలతో రాహుల్ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని అన్నారు. సమతా విగ్రహం తయారీకి, బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎనిమిదేళ్ల క్రితమే విగ్రహం తయారీ ప్రారంభమైందని, అప్పట్లో కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు.

విగ్రహ తయారీకి అవసరమైన నిధులన్నీ ప్రైవేటుగా సమకూర్చినవేనని అన్నారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్‌కు పిలుపునివ్వకముందే విగ్రహ తయారీ ప్రారంభమైందని, రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. అంతేకాదు, చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం చేసుకున్న పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు.
Rahul Gandhi
Statue Of Equality
Narendra Modi
Atma Nirbhar Bharat
China

More Telugu News