Sanjay Raut: ‘మహా’ సర్కారును కూల్చేందుకు కొందరు నన్ను సాయం అడిగారు: సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన నేత సంజయ్ రౌత్

  • రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు
  • కూల్చేందుకు సహకరించకుంటే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు
  • బీజేపీతో కలిసి ఈడీ అధికారులు క్రిమినల్ సిండికేట్‌గా మారారు
  • కూటమి ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుంది
Asked By Bosses To Fix Me Sena s Sanjay Rauts Sensational Charge

శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహావికాస్ అఘాడి (ఎంవీఎస్) ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాయం కావాలంటూ కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని, కలసి రాకుంటే జైలుకు పంపుతామని బెదిరించారని ఆరోపించారు.

 రైల్వే మాజీ మంత్రిలా కొన్ని సంవత్సరాలపాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని తనను హెచ్చరించారని అన్నారు. ఈ విషయాలన్నీ పేర్కొంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి ఆయన ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈడీ వంటి సంస్థలను వాడుతున్నారని ఆరోపించారు. ఫిర్యాదు లేఖ ప్రతులను తమ కూటమి భాగస్వామ్య పక్షాలకు కూడా రౌత్ పంపించారు.

అంతేకాదు, ఇదే విషయాన్ని ట్విట్టర్‌లోనూ షేర్ చేశారు. ఝకేంగే నహీ.. జై మహారాష్ట్ర (తగ్గేదే లేదు.. జై మహారాష్ట్ర) అని క్యాప్షన్ తగిలించారు. తమ కూటమి ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని రౌత్ ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ లేఖ ట్రైలర్ మాత్రమేనని, బీజేపీతో కలిసి ఈడీ అధికారులు క్రిమినల్ సిండికేట్‌గా ఎలా మారారో కూడా బయటపెడతానని రౌత్ పేర్కొన్నారు.

More Telugu News