PM Modi: గత 50 ఏళ్లలో కాంగ్రెస్ దేశాన్ని విభజించడానికే పనిచేసింది: మరోసారి ప్రధాని మోదీ విమర్శలు

PM Modi once again scathing attack on Congress partty
  • మరోసారి కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన మోదీ
  • దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రణాళికలు రచిస్తున్నారని ఆగ్రహం
  • ప్రజా సంక్షేమమే తమ నినాదం అని వెల్లడి

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించడానికి మాత్రమే పనిచేసిందని అన్నారు. దేశం, దేశ ప్రజల లక్షణం విభజన సూత్రం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రణాళికలు రచిస్తున్నాయని ఆరోపించారు. అయితే ప్రజలు ప్రతిపక్షాల ఉచ్చులో పడకుండా ఎంతో పరిణతిలో ఉన్నారని శ్లాఘించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల ప్రజలు సేవ చేసేందుకు బీజేపీకే అవకాశం ఇస్తారని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఉద్ఘాటించారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో పనిచేస్తున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ హవా వీస్తోందని స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సంక్షేమమే తమ నినాదం అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామని చెప్పారు. అధికారంలోకి ఒకసారి వచ్చి వెళ్లు అనేది యూపీలో పాత సిద్ధాంతం అని, ఆ సిద్ధాంతాన్ని యూపీ ప్రజలు ఎప్పుడో దూరంగా విసిరేశారని తెలిపారు. మా పాలన చూసిన యూపీ ప్రజలు మళ్లీ మాకే పట్టం కడతారు అని ప్రధాని పేర్కొన్నారు.

తాను కూడా పార్టీ సాధారణ కార్యకర్తనే అని వెల్లడించారు. గెలుపు ఓటములను తాము సమానంగా స్వీకరిస్తామని అన్నారు. రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలు తనకు బాగా తెలుసని, ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చడాన్ని బీజేపీ విశ్వసిస్తుందని మోదీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News