Jammu And Kashmir: కశ్మీర్ స్వాతంత్ర్యంపై హోండా, డొమినోస్ పాక్ డీలర్ల ట్వీట్లు.. స్పందించిన సంస్థలు

Honda and Dominos Apologize For Comments On Kashmir
  • భారత్ తమ ఇల్లు అని డొమినోస్ ప్రకటన
  • భారత సంస్కృతి అంటే గౌరవమని వ్యాఖ్య
  • జాతి, మతం, రాజకీయాలపై మాట్లాడరాదన్నది తమ సిద్ధాంతమన్న హోండా
  • దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించబోమని వెల్లడి
హ్యూందాయ్, కేఎఫ్ సీల పాకిస్థాన్ డీలర్ల బాటలోనే హోండా, డొమినోస్ పాక్ డీలర్లు నడిచారు. కశ్మీర్ కు స్వాతంత్ర్యం కావాలంటూ ట్వీట్లు చేశారు. కశ్మీర్ ప్రజలకు మద్దతునిస్తున్నామని ప్రకటించారు. దీనిపై హోండా, డొమినోస్ లు స్పందిస్తూ, క్షమాపణలు కోరాయి. 25 ఏళ్లుగా భారత్ లో ఉంటున్నామని, ఆ దేశాన్ని కించపరచాలనుకోవట్లేదని డొమినోస్ ప్రకటించింది.

‘‘భారత విలువలకు మేం కట్టుబడి ఉన్నాం. 25 ఏళ్లుగా మేం భారత్ లో బిజినెస్ చేస్తున్నాం. భారత్ ను మా ఇల్లు అనుకుంటున్నాం. ఆ దేశ ప్రజలన్నా, సంస్కృతి అన్నా, జాతీయవాద స్ఫూర్తి అన్నా మాకు ఎంతో గౌరవం. వేరే దేశానికి చెందిన ఔట్ లెట్లు చేసిన పోస్టులపై చింతిస్తున్నాం. భారత్ ను ఎల్లప్పుడూ గౌరవిస్తాం. అత్యంత గౌరవం, గర్వకారణంతో మా కస్టమర్లకు సేవలను అందిస్తాం’’ అని ట్వీట్ చేసింది.


హోండా కూడా ఇదే తరహాలో క్షమాపణలు కోరింది. ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా అక్కడి జాతి, మతం, రాజకీయాలు, సామాజిక అంశాలపై మాట్లాడకూడదన్నది తమ సిద్ధాంతమని హోండా వెల్లడించింది. ‘‘మా విధానాలకు విరుద్ధంగా ఏ అసోసియేట్ అయినా, డీలర్ అయినా, భాగస్వాములైనా వ్యాఖ్యలు చేస్తే సహించం. వివిధ దేశాల చట్టాలకు లోబడే హోండా పనిచేస్తుంది. కాబట్టి ఎవరి మనోభావాలనైనా దెబ్బ తీసి ఉంటే తీవ్రంగా చింతిస్తున్నాం’’ అని విచారం వ్యక్తం చేసింది.

కాగా, కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు అనుకూలంగా ఆ రాష్ట్రానికి స్వాతంత్ర్యం కావాలంటూ హ్యూందాయ్, కేఎఫ్ సీలు ట్వీట్లు చేయడంతో ఎంత రచ్చయింతో తెలిసిందే. హ్యూందాయ్, కేఎఫ్ సీలను బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. చాలా మంది కస్టమర్లు హ్యూందాయ్ కార్లను బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. కేఎఫ్ సీల్లో తినబోమంటూ కామెంట్ చేశారు.
Jammu And Kashmir
Honda
Dominos

More Telugu News