K Keshav Rao: మోదీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడానికి న్యాయ సలహా తీసుకుంటున్నాం: టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు

  • తెలంగాణను అవమానించేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయి
  • ఏపీ విభజనకు బీజేపీ కూడా సపోర్ట్ చేసిందనే విషయాన్ని మోదీ మర్చిపోయారు
  • ఝార్ఖండ్ రాష్ట్ర బిల్లును పాస్ చేసేటప్పుడు కూడా సభలో గొడవలు జరిగాయన్న కేశవరావు 
Will take legal opinion to complain on Modi to privilege committee says K Keshav Rao

ఏపీ విభజన సరైన పద్ధతిలో జరగలేదంటూ రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని లేపాయి. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణను అవమానించేలా మోదీ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు ప్రొసీడింగ్స్ ను మంట కలిపేలా మోదీ మాట్లాడారని విమర్శించారు. పార్లమెంటు వ్యవహారాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోవని చెప్పారు. పార్లమెంటులో బిల్లులు పాస్ చేయడం మాత్రమే ఉంటుందని చెప్పారు. ఏపీ విభజన బిల్లుకు బీజేపీ కూడా సపోర్ట్ చేసిందనే విషయాన్ని మోదీ మర్చిపోయారని అన్నారు.

విభజన సమయంలో ఆంధ్ర ఎంపీలు చేసిన గడబిడ వల్ల సభలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయని కేకే చెప్పారు. రాష్ట్ర విభజనపై అసందర్భంగా మాట్లాడి మోదీ తప్పు చేశారని అన్నారు. ఝార్ఖండ్ రాష్ట్ర బిల్లును పాస్ చేసేటప్పుడు కూడా సభలో గొడవలు జరిగాయని.. అప్పటి ఎంపీ ఆనంద్ మోహన్ చేయి విరిగిందని చెప్పారు. మోదీ మాటలను ఖండించడానికి తమకు మాటలు కూడా సరిపోవడం లేదని అన్నారు. మోదీపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడంపై న్యాయ సలహా తీసుకుంటామని చెప్పారు.

More Telugu News