Malladi Vishnu: నాడు బీజేపీ సమర్థించకుంటే ఏపీ విభజన జరిగేది కాదు: మల్లాది విష్ణు

Malladi Vishnu reacts to Modi comments on bifurcation
  • కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన సరిగా చేయలేదన్న ప్రధాని
  • ప్రధాని వ్యాఖ్యలతో దుమారం
  • ప్రధాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న మల్లాది
  • కాంగ్రెస్, బీజేపీ రెండూ ముద్దాయిలేనని వెల్లడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన... ఏపీ, తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. తప్పంతా కాంగ్రెస్ పార్టీదే అన్నట్టుగా మోదీ విమర్శించారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఘాటుగా స్పందించారు.

ఉమ్మడి రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీ రెండూ ముద్దాయిలేనని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సరిగా విభజించలేదని ప్రధాని అనడం తప్పించుకోవడానికి చేసిన వ్యాఖ్యలా అనిపిస్తోందని విమర్శించారు. జరిగిన తప్పు మాది కాదంటే మాది కాదని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. అసలు, బీజేపీ సమర్థించకుంటే నాడు ఏపీ విభజన జరిగి ఉండేదే కాదని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు.

"విభజన చట్టాన్ని అమలు చేయడంలేదు, ప్రత్యేక హోదా ఇవ్వడంలేదు... ప్రత్యేక హోదా గురించి తిరుపతిలో ప్రధాని చేసిన వాగ్దానం గంగలో కలిసింది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ సీఎం జగన్ పదేపదే అడుగుతూనే ఉన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరితే, అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ అంటోంది" అని విమర్శించారు. ఏపీకి న్యాయం చేస్తామని అధికారంలోకి రాకముందు చెప్పిన బీజేపీ, అధికారంలోకి వచ్చాక పెడచెవిన పెడుతోంది అని మల్లాది విష్ణు ఆరోపించారు.
Malladi Vishnu
Narendra Modi
Bifurcation
Andhra Pradesh
Telangana
BJP
Congress

More Telugu News