Bonda Uma: విజయవాడకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితో రేపు దీక్ష చేస్తున్నాం: బొండా ఉమ

Bonda Uma taking up deeksha demanding Seperate Ranga district
  • కృష్ణలో ఒక జిల్లాకు ఎన్టీఆర్, మరో జిల్లాకు రంగా పేరు పెట్టాలి
  • రంగా పేరు పెట్టకపోతే ఆయనను జగన్ అవమానించినట్టే
  • దీక్షకు వంగవీటి రాధాను ఆహ్వానిస్తున్నాం
విజయవాడను రెండు జిల్లాలుగా విభజిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు, మరొక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని టీడీపీ నేత బొండా ఉమ డిమాండ్ చేశారు. విజయవాడ జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ రేపు ఉదయం ధర్నా చౌక్ వద్ద వేలాది మందితో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రి నివాసాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పారు. వంగవీటి రంగా విగ్రహం లేని ప్రాంతం లేదని... జిల్లాకు రంగా వంటి మహానేత పేరు పెట్టకపోతే ఆయనను జగన్ అవమానించినట్టేనని అన్నారు.

రంగా ఒక కులానికో, కుటుంబానికో చెందిన వ్యక్తి కాదని బొండా ఉమ వ్యాఖ్యానించారు. విజయవాడకు రంగా పేరు, తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరారు. రంగా పేరు పెట్టాలని 10 రోజుల నుంచి అడుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. రంగా కుటుంబ సభ్యులు వారికి సన్నిహితులైన కొడాలి నాని, వల్లభనేని వంశీల ద్వారా జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. తాము చేపట్టబోయే దీక్షకు వంగవీటి రాధను ఆహ్వానిద్దామనుకున్నామని... కానీ ఆయన అందుబాటులో లేరని, అందుకే ఆయనను మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.
Bonda Uma
Vangaveeti Ranga
Ranga District
jagan
YSRCP

More Telugu News