Jay Shah: భారత్, పాక్ లతో కలిపి 4 దేశాల టీ20 టోర్నీ నిర్వహించాలన్న పీసీబీ చీఫ్... స్వల్పకాలికమేనన్న బీసీసీఐ

  • భారత్, పాక్ దేశాల మధ్య రాజకీయ వైరుధ్యాలు
  • నిలిచిన దాయాదుల ద్వైపాక్షిక క్రికెట్
  • ప్రతి ఏటా టోర్నీకి రమీజ్ రాజా ప్రతిపాదన
  • స్పందించిన బీసీసీఐ కార్యదర్శి
BCCI Secretary Jay Shah responds to Ramiz Raja proposal

రాజకీయపరమైన కారణాలతో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు చాలాకాలంగా నిలిచిపోయాయి. ఐసీసీ ఈవెంట్లలో తప్ప దాయాదులు పరస్పరం ఆడడంలేదు. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ రమీజ్ రాజా ఇటీవల ఓ ప్రతిపాదన చేశారు.

భారత్, పాకిస్థాన్ జట్లతో కలిపి 4 దేశాల టీ20 టోర్నీని ప్రతి ఏటా నిర్వహించాలని సూచించారు. మరో రెండు జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అని వెల్లడించారు. అందుకోసం ఐసీసీ నేతృత్వంలో పనిచేసేలా ఓ రిజిస్టర్డ్ సంస్థను ఏర్పాటు చేయాలని, నాలుగు దేశాల టోర్నీ నిర్వహణ, నాలుగు దేశాల క్రికెట్ బోర్డుకు ఆదాయ పంపకం ఈ సంస్థకు అప్పగించాలని తెలిపారు.

ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య యాషెస్, భారత్-పాక్ మధ్య సహజసిద్ధంగా ఉండే పోటీ ఈ టోర్నీకి విశేష ప్రజాదరణ తెచ్చిపెడుతుందని రమీజ్ రాజా అభిప్రాయపడ్డారు. లీగ్ క్రికెట్ తో అలసిపోయిన అభిమానులకు ఈ నాలుగు దేశాల టోర్నీ ఓ విందు భోజనంలా ఉంటుందని పేర్కొన్నారు.

దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కార్యదర్శి జై షా స్పందించారు. రమీజ్ రాజా ప్రతిపాదన స్వల్పకాలిక వాణిజ్యపరమైన కార్యాచరణగా అభివర్ణించారు. ప్రతి ఏడాది అనేక ఐసీసీ ఈవెంట్లు ఉండనే ఉంటాయని, దానికితోడు ఐపీఎల్ కూడా మరింత విస్తరిస్తోందని, ఇలాంటి తరుణంలో సొంతగడ్డపై టెస్టు క్రికెట్ తో కూడిన ద్వైపాక్షిక సిరీస్ లను సజీవంగా ఉంచడం అనేది తమ ప్రధాన బాధ్యతగా మారిందని షా పేర్కొన్నారు.

ఒలింపిక్స్ లోనూ క్రికెట్ కు స్థానం అనే అంశంపై ఆలోచిస్తున్నామని, ఆట అభ్యున్నతికి ఇది తోడ్పాటు అందిస్తుందని వివరించారు. అయితే, క్రికెట్ క్రీడను మరింత విస్తరించడం అనేది ఓ సవాల్ అని, ఇలాంటి స్వల్పకాలిక ఆదాయ ప్రణాళికలను మించి ఏదైనా చేయాల్సి ఉంటుందని జై షా పేర్కొన్నారు. కాగా, రమీజ్ రాజా 4 దేశాల టీ20 టోర్నీ ప్రతిపాదనను వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో చర్చకు తీసుకురావాలని భావిస్తున్నారు.

More Telugu News