Antibiotic Resistance: యాంటీ బయోటిక్స్ ఇష్టారీతిన వాడితే నష్టమే.. వైద్యుల హెచ్చరిక

  • యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది
  • బ్యాక్టీరియా అదుపులోకి రాదు
  • మరింత పెరిగిపోతుంది
  • దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలుంటాయన్న వైద్యులు  
Antibiotic Resistance A Hidden Threat Lurking Behind Covid

కరోనా మూడో విడతలో ఎక్కువ మంది ఫార్మసీ స్టోర్ల నుంచి యాంటీ బయోటిక్ ఔషధాలను కొనుగోలు చేసి వాడుతున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే ఇలా ఇష్టారీతిన యాంటీబయోటిక్ ఔషధాలను వాడడం హాని చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అంటే.. ఒక కోర్స్ ప్రకారం కాకుండా వినియోగించడం. దీనివల్ల యాంటీబయోటిక్స్ ప్రభావాన్ని ఎదుర్కొనే శక్తి బ్యాక్టీరియాకు లభిస్తుంది. దాంతో అవి నశించకుండా శరీర వ్యవస్థపై మరింత దాడి చేస్తాయి.

యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కేసులు ఎన్నో చూస్తున్నామని, వారికి చికిత్స చేయడం కష్టంగా ఉందని వైద్యులు అంటున్నారు. అన్ని రకాల యాంటీబయోటిక్స్ కు నిరోధకత ఏర్పడిన రోగులను చూస్తున్నామని, వైద్యుడు ఒక్కసారి సూచిస్తే.. వాటినే మళ్లీ మళ్లీ తెచ్చుకుని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు చెబుతున్నారు.

యాంటీబయోటిక్స్ ను అధికంగా వినియోగించినా లేక విధానం ప్రకారం తీసుకోకపోయినా బ్యాక్టీరియా మరింత వృద్ధి చెందుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ అయిన కోవిడ్ లో యాంటీబయోటిక్స్ ప్రభావం చూపించడం లేదన్న ఇటీవలి అధ్యయనాలను కూడా గుర్తు చేస్తున్నారు.

‘‘ఐసీఎంఆర్ కోవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి యాంటీబయోటిక్స్ ను తీసేసింది. కానీ, వీటిని ప్రతి ఇద్దరిలో ఒకరికి సూచిస్తూనే ఉన్నారు’’ అని ఓ డాక్టర్ తెలిపారు. కోవిడ్ ఐసోలేషన్ కిట్లలోనూ యాంటీబయోటిక్స్ ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

More Telugu News