Jagan: గానకోకిల ల‌తా మంగేష్క‌ర్‌కు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖుల‌ నివాళులు

  • గ్రహీత లతా మంగేష్కర్‌గారి మృతి బాధాకరం: గడ్క‌రీ
  • సంగీత లోకానికి తీరని లోటు: బిశ్వ భూషణ్ హరిచందన్
  • ఈ వార్త‌ తెలిసి చాలా బాధపడ్డాను: ఏపీ సీఎం జ‌గ‌న్
  • ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాలి: చిరంజీవి
jagan and tollywood condolences

గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. భారత రత్న గ్రహీత లతా మంగేష్కర్‌గారి మృతి బాధాకరమ‌ని కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీ ట్వీట్ చేశారు. ఆమె మృతి దేశానికి తీరని లోటని, ఆమె పవిత్ర ఆత్మకు హృదయపూర్వక నివాళులు అరిస్తున్నానని చెప్పారు.

గానంతో కోట్లాది మందిని అలరించిన ఇండియన్ నైటింగేల్, భారతరత్న లతా మంగేష్కర్ మృతి సంగీత లోకానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. లతా మంగేష్కర్ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాన‌ని బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.

లతా మంగేష్కర్ జీ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా బాధపడ్డానని ఏపీ సీఎం జ‌గ‌న్ ట్వీట్ చేశారు. ఆమె మధురమైన స్వరం నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.

ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని సినీన‌టుడు చిరంజీవి పేర్కొన్నారు. గొప్ప వ్యక్తుల్లో ఒక‌రైన నైటింగిల్ ఆఫ్ ఇండియా ల‌తా మంగేష్క‌ర్ మృతి చెందార‌న్న వార్త విని హృద‌యం ముక్క‌లైంద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. ల‌లా మంగేష్క‌ర్ అసాధారణ జీవనాన్ని గ‌డిపార‌ని ఆయ‌న అన్నారు. ఆమె పాట‌లు ఎప్ప‌టికీ స‌జీవంగా ఉంటాయ‌ని చెప్పారు.

లతా మంగేష్కర్‌ మరణవార్త ఎంతగానో బాధిస్తోందని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ట్వీట్ చేశారు.  రాబోయే తరాలకు విలువైన పాటల వారసత్వాన్ని మిగిల్చార‌ని చెప్పారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన‌ని చెప్పారు.

ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల సినీన‌టుడు మ‌హేశ్ బాబు సంతాపం తెలిపారు. లతా మంగేష్కర్‌గారి మృతి వార్త తెలుసుకుని బాధప‌డ్డాన‌ని తెలిపారు. ఆమె కుటుం స‌భ్యులకు సానుభూతి తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

'గాన కోకిల ముగబోయింది.. భారత రత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్ గారి మరణం బాధాకరం. భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలని ఆలపించారు. వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు కి నా ప్రగాఢ సానుభూతి ని తెలుపుతున్నాను' అని టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి పేర్కొన్నారు.

'ప్రముఖ గాయని, శ్రీమతి లతా మంగేష్కర్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.  ప్రముఖ గాయనిగా 980 సినిమాలకు, 20 భాషలలో 50 వేలకు పైగా పాటలు పాడి తన గానంతో సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భారత ప్రభుత్వం చేత భారతరత్న, పద్మ విభూషణ్ వంటి అనేక పురస్కారాలు వారు అందుకున్నారు.. వారి మరణం సినీ సంగీత లోకానికి తీరని లోటు.. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు.

More Telugu News