Andhra Pradesh: డిమాండ్లు సాధించుకోవడంలో విఫలమయ్యాం.. చీకటి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: ఏపీటీఎఫ్

  • చర్చలు సఫలమైనట్టు ప్రకటించిన ప్రభుత్వం
  • కలిసివచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామన్న ఏపీటీఎఫ్
  • ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి పెంచుకోలేకపోయామని ఆవేదన
APTF said protest will continue

ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు సఫలమైనట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపినా డిమాండ్లు సాధించుకోవడంలో విఫలమయ్యామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) అధ్యక్షుడు భానుమూర్తి, కార్యదర్శులు పాండురంగ వరప్రసాదరావు అన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో తాము విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చీకటి ఒప్పందం తప్ప మరోటి కాదన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

అంతేకాదు, తమతో కలిసి వచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దుపై చర్చల్లో ఎలాంటి నిర్ణయమూ జరగలేదని, హెచ్ఆర్ఏ శ్లాబులను పునరుద్ధరించలేకపోయామని అన్నారు. ఈ విషయంలో గ్రామీణ ఉద్యోగులకు బోల్డంత నష్టం జరుగుతుందన్నారు.

నిజానికి ఈ చర్చల్లో ఐఆర్ ఇచ్చిన తేదీ నుంచి మానిటర్ బెనిఫిట్ ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చ జరగనే లేదన్నారు. అంతేకాదు, పీఆర్‌సీ నివేదికను చూడలేకపోయామన్నారు. దీంతోపాటు తమ ప్రధాన డిమాండ్ అయిన ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి పెంచుకోలేకపోయామని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News