MLC Ashok Kumar: నాడు వైఎస్సార్ ఉద్యోగులతో రోజంతా గడిపారు... మీరేం చేశారు?: సీఎం జగన్ పై అశోక్ బాబు విమర్శనాస్త్రాలు

  • ఏపీలో ఉద్యమ బాటలో ఉద్యోగులు
  • ఈ నెల 6 నుంచి సమ్మె
  • ప్రభుత్వ వైఖరి సరిగా లేదన్న అశోక్ బాబు
  • సీఎం 10 నిమిషాలు కూడా చర్చించలేకపోయారని విమర్శలు
MLC Ashok Babu criticizes CM Jagan over employees issue

ఏపీలో ఉద్యమ బాటలో నడుస్తున్న ఉద్యోగులతో సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరి సరిగాలేదని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ ఉద్యోగ నేత అశోక్ బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 8 లక్షల మంది ఉద్యోగులు, 3.80 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని, వారందరూ పీఆర్సీ కోసం పోరాడుతుంటే, సీఎం కనీసం అరగంట కూడా చర్చించలేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అంత బిజీగా ఉండే ఉద్యోగం మీరేం చేస్తున్నారని సీఎం జగన్ ను నిలదీశారు.

"గతంలో ఉద్యోగులకు సమస్యలు వస్తే మీ తండ్రి (వైఎస్) గారు మాతో రోజంతా గడిపారు. అందుకు నేనే సాక్ష్యం. ఉద్యోగ జేఏసీ తరఫున ఓ 50 మందితో వెళ్లి ఆయన్ను కలిశాం. ఆయన పూర్తిగా ఒకరోజు సమయాన్ని మాకు కేటాయించారు. రోజంతా మాతోనే ఉన్నారు. మీ జీతాలు ఏంటి? ఇతర అంశాలు ఏంటి? మాకింత భారం పడుతోంది... ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అని ఆయన ఉద్యోగులకు విడమర్చి చెప్పారు. పైగా ఉద్యోగులతో ఎంతో అనునయంగా మాట్లాడి ఒప్పించారు కూడా. తక్కువ ఫిట్ మెంట్ అని భావించకుండా ఇప్పటికి ఒప్పుకోండి... భవిష్యత్ లో మీకు మంచి చేస్తా అని నచ్చచెప్పారు.

కానీ మీరు (జగన్) ఏంచేశారు? కనీసం పది నిమిషాలు ఉద్యోగులతో మాట్లాడలేకపోయారు! కనీసం మానవ సంబంధాల దృష్ట్యా కూడా వ్యవహరించలేదు. ఎంతసేపటికీ... అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి అంటారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్పకపోతే చర్యలు తీసుకోండి, ఉద్యోగి తన విధులు నిర్వర్తించకపోతేనో, అవినీతికి పాల్పడితేనో చర్యలు తీసుకోండి. అంతేకానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ఉద్యోగ ఉపాధ్యాయులకేంటి సంబంధం? ఆర్థిక పరిస్థితి అనేది మీ ప్రభుత్వ విధివిధానాలతో సంబంధం కలిగి ఉంటుంది.

మా నాయకుడికి అవగాహన లేదని చాలామంది వైసీపీ నేతలే అంటున్నారు. అవగాహన లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. సలహాదారులు కూడా అలాగే ఉన్నారు. సలహాదారుల విషయాన్ని సీఎం పునరాలోచించుకోవాలి. జగన్ గెలవాలని రెండు చేతులా ఓట్లేసిన వారే ఇవాళ లక్షలాదిగా రోడ్లెక్కే పరిస్థితి వచ్చిందంటే వారి మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో అర్థమవుతోంది. ఎందుకు వారి మనోభావాలు దెబ్బతిన్నయ్యో తెలుసుకోలేకపోతే వారు కోరుకున్నదే జరుగుతుంది.

రాజకీయంగా మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను గతంలో ఉద్యోగ సంఘం నేతగా పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో చెబుతున్నా. గతంలో రోశయ్య ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్దకు 50 వేల మంది ఉద్యోగులు వచ్చారు. రోశయ్య దురదృష్టమో, మా అదృష్టమో కానీ ఆ రోజే ఆయన్ను పదవి నుంచి తప్పించి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి వారం రోజుల్లో అన్ని విషయాలను చక్కదిద్దారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా ఉద్యోగుల విషయంలో ఇప్పటివరకు ఏదైతే అనుసరించారో అది మంచి పద్ధతి కాదు" అంటూ అశోక్ బాబు ఓ మీడియాకు వివరించారు.

More Telugu News