Giriraj Singh Malinga: నా దగ్గర ఉన్నది బొమ్మ తుపాకీ అనుకుంటున్నావేమో!: బందిపోటు దొంగకు వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే

  • బారి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిరాజ్
  • బందిపోటు గుర్జార్ తో సవాళ్ల పర్వం
  • భద్రతా సిబ్బంది లేకుండా ఎదుర్కోవాలన్న గుర్జార్
  • ఓ మనిషికి పుట్టినవాడైతే రావాలని గిరిరాజ్ ప్రతిసవాల్
Congress MLA Giriraj Singh Malinga warns decoit

రాజస్థాన్ లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, బందిపోటు దొంగకు మధ్య ఆసక్తికరమైన రీతిలో వీడియో వార్ నడుస్తోంది. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే పేరు గిరిరాజ్ సింగ్ మలింగా. ఆయన బారి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఆయనతో ఢీ అంటే ఢీ అంటున్న బందిపోటు పేరు జగన్ గుర్జార్. హత్యలు, కిడ్నాపులు, దోపిడీలు, దొంగతనాలు... ఇలా గుర్జార్ పై 120కి పైగా కేసులున్నాయి.

ఇటీవల గుర్జార్ ధోల్ పూర్ లో కొందరు దుకాణదారులతో గొడవపడి, గాల్లోకి కాల్పులు జరిపాడు. దీనిపై ఆ దుకాణదారులు పోలీసులకు, ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఆ బందిపోటు కోసం వేట మొదలుపెట్టారు. తనపై పోలీసుల గాలింపునకు ఎమ్మెల్యేనే కారణమని భావించిన బందిపోటు జగన్ గుర్జార్... బెదిరింపుల వీడియో రిలీజ్ చేశాడు. ఆపై మరో వీడియోలో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జస్వంత్ నియోజకవర్గ ఎమ్మెల్యేని చంపాలంటూ ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ తనను కోరాడని, అయితే తాను అతడ్ని చంపలేదని బందిపోటు గుర్జార్ వెల్లడించాడు.

కాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తనపై గుర్జార్ చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే గిరిరాజ్ కొట్టిపారేశారు. అయితే, ఆ బందిపోటు మరోసారి వీడియో రిలీజ్ చేసి ఎమ్మెల్యేకి సవాల్ విసిరాడు. దమ్ముంటే భద్రతా సిబ్బంది లేకుండా తనను ఎదుర్కోవాలని మరో వీడియోలో పేర్కొన్నాడు.

ఈసారి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే తాను కూడా ఓ వీడియో విడుదల చేశారు. "నేను ఎలాంటి పోలీసు రక్షణ తీసుకోను. వాడు ఒక మనిషికే పుట్టి ఉంటే నా ఇంటికి వచ్చి నన్ను ఎదుర్కోవాలి" అంటూ బందిపోటు గుర్జార్ కి ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు, మీడియాతో మాట్లాడుతూ, "ఈ గుర్జార్ లాంటి వాళ్లు లోకల్ గూండాలు. వాళ్లు ఎప్పుడూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. ఇలాంటి చర్యలను నేను అంగీకరించను. నన్ను తుపాకీతో కాల్చేస్తానని గుర్జార్ బెదిరిస్తున్నాడు... కానీ నా వద్ద ఉన్నది బొమ్మ తుపాకీ కాదని అతడు గుర్తుంచుకోవాలి" అని ఎమ్మెల్యే గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.

కాగా, బందిపోటు జగన్ గుర్జార్ పై రాజస్థాన్ పోలీసులు రూ.50 వేల రివార్డును ప్రకటించారు. జగన్ గుర్జార్ వార్తల్లోకెక్కడం ఇదే ప్రథమం కాదు. 2008లో అప్పటి సీఎం వసుంధర రాజే నివాసాన్ని పేల్చివేస్తానంటూ సంచలనం సృష్టించాడు. 2009లో కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ సభలో గుర్జార్ లొంగిపోయాడు.

More Telugu News