Koningshaven Bridge: అమెజాన్ అధినేత కోసం చారిత్రక బ్రిడ్జిని కూల్చివేస్తారా?

Proposal for dismantle historic Koningshaven bridge in Rotterdam
  • సొంతంగా లగ్జరీ షిప్ తయారు చేయిస్తున్న బెజోస్
  • నెదర్లాండ్స్ లోని రోటర్ డామ్ లో నిర్మాణం
  • షిప్ సముద్రంలోకి చేరేందుకు ఓ వారధి అడ్డంకి 
  • కూల్చివేసేందుకు అనుమతి ఇవ్వాలన్న షిప్ తయారీదారు
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రపంచ సంపన్నుడు అని తెలిసిందే. ప్రస్తుతం ఆయన నెదర్లాండ్స్ లోని రోటర్ డామ్ నగరంలో సొంతంగా ఓ లగ్జరీ నౌకను తయారు చేయించుకుంటున్నారు. అయితే, ఈ నౌక డిజైన్ పరంగా చాలా ఎత్తు ఉంటుంది. ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఈ నౌక సముద్రంలోకి ప్రవేశించాలంటే రోటర్ డామ్ నగరంలోని నది ద్వారా ప్రయాణించాలి. ఇక్కడి చారిత్రాత్మక కానింగ్ షేవెన్ వారిధిని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది.

కానీ నౌకకు అమర్చిన కొన్ని నిర్మాణాలు ఈ బ్రిడ్జి కంటే ఎత్తుగా ఉన్నాయి. దాంతో ఈ చారిత్రక వారధిని పాక్షికంగా కూల్చివేయాలని భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా ఇంకా నిర్ణయం ప్రకటించకపోయినా, ప్రతిపాదనలు మాత్రం ఉన్నాయి. బ్రిడ్జిని కొద్దిగా తొలగించాలంటూ నౌక తయారుచేస్తున్న సంస్థ నుంచి నగరపాలక సంస్థకు అభ్యర్థన అందినట్టు అధికారులు చెబుతున్నారు.

అయితే, దీనిపై రోటర్ డామ్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 95 ఏళ్ల నాటి వంతెనను కూల్చివేస్తారా? అంటూ పలువురు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. జెఫ్ బెజోస్ అత్యంత ధనవంతుడు కాబట్టి కూల్చివేస్తున్నారని, కానీ సామాన్యుల అవసరాల కోసం ఆ పని చేయగలరా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా వుంటే ఆ బ్రిడ్జి గుండా జెఫ్ బెజోస్ నౌక వెళుతుంటే కోడిగుడ్లు విసిరి నిరసన తెలపాలని 600 మంది ఫేస్ బుక్ యూజర్లు నిర్ణయించారు. వీరంతా ఫేస్ బుక్ లో ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు. వాస్తవానికి ఈ వంతెనకు 130 అడుగుల బోట్ క్లియరెన్స్ కూడా ఉన్నప్పటికీ, జెఫ్ బెజోస్ నౌక భారీ ఎత్తున నిర్మితమవుతుండడంతో పాక్షికంగా కూల్చివేయాలని భావిస్తున్నారు. ఈ వంతెన చాలాకాలంగా వాడుకలో లేదు. అయినప్పటికీ ఇది గతకాలపు చిహ్నంలా నగరానికి వన్నె తెస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. స్థానికంగా ఈ వంతెనను 'డీ హెఫ్' అని పిలుస్తారు.
Koningshaven Bridge
Jeff Bezos
Ship
Nederlands
Amazon

More Telugu News