NEET: నీట్–పీజీ 2022 వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

  • మార్చి 12న జరగాల్సిన నీట్
  • 6 నుంచి 8 వారాల పాటు వాయిదా వేసిన కేంద్రం
  • నీట్ 2021 కౌన్సెలింగ్ తేదీనాడే నీట్–పీజీ 2022
  • విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరు కాలేరని వాయిదా నిర్ణయం
Center Postponed NEET PG 2022 Orders Released

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)– పీజీని కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఆరు నుంచి 8 వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి మార్చి 12న ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అయితే, కొన్నాళ్ల పాటు పరీక్షలను వాయిదా వేయాలంటూ జూనియర్ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఇవాళ సుప్రీంకోర్టులో దానిపై విచారణ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే వారి విజ్ఞప్తి మేరకు నీట్ ను వాయిదా వేస్తున్నట్టు తెలియజేసింది.

‘‘ఎన్ బీఈ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) మెడికల్ సైన్సెస్ విడుదల చేసిన సమాచార బులెటిన్ ప్రకారం నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ కూడా మార్చి 12నే జరగనుంది. అదే రోజు నీట్–పీజీ కూడా క్లాష్ అవుతోంది. అంతేగాకుండా చాలా మంది ఇంటర్న్ లు మే వరకు పీజీ కౌన్సెలింగ్ కు హాజరు కాలేని పరిస్థితి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నీట్ ను వాయిదా వేయాలని ఆరోగ్య శాఖ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. కనీసం ఆరు నుంచి 8 వారాల పాటు పరీక్షలు వాయిదా వేయాలని సూచించారు’’ అని ఉత్తర్వుల్లో హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ పేర్కొన్నారు.

కాగా, ఎగ్జామ్ ను వెంటనే వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు ఎంబీబీఎస్ విద్యార్థులు జనవరి 25న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నీట్–పీజీలో పెట్టిన నిబంధనల వల్ల చాలా మంది స్టూడెంట్లు పీజీకి దూరమయ్యే పరిస్థితులున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. పీజీ కోర్సు చదివే విద్యార్థులలో ఒక యూనిట్ విద్యార్థులకు ఆసుపత్రిలోని 30 బెడ్ల డ్యూటీని అప్పగించాలన్న నిబంధన ఉందని, ఇప్పుడు రెండు అకడమిక్ సెషన్లలో ఇద్దరు స్టూడెంట్లను దానికే కేటాయించాలన్న రూల్ పెట్టారని ఆక్షేపించారు. ఈ వ్యాజ్యాన్ని ఇవాళ సుప్రీంకోర్టు విచారించనుంది.

More Telugu News