Govt: ‘ఉమ్మడి పౌర స్మృతి’ భవిష్యత్తును నిర్ణయించనున్న 22వ న్యాయ కమిషన్

  • ఈ అంశంపై న్యాయ కమిషన్ అధ్యయనం చేస్తుంది
  • సిఫారసుల తర్వాత నిర్ణయం
  • న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు
Govt refered uniform civil code issue to law panel

మతాలతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ ఒకటే ఉమ్మడి నియమావళిని ప్రతిపాదించే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని 22వ న్యాయ కమిషన్ కు నివేదించినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. బీజేపీ లోక్ సభ సభ్యుడు నిషికాంత్ లేఖకు మంత్రి రిజిజు సమాధానం ఇచ్చారు. 22వ న్యాయ కమిషన్ కు ప్రభుత్వం ఇంకా చైర్మన్ ను నియమించాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా పౌరులు అందరికీ ఒకటే నియమావళి అమలు చేసేందుకు రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ అనుమతిస్తున్నట్లు రిజిజు చెప్పారు. సున్నితమైన ఈ అంశంలో లోతైన అధ్యయనం అవసరమని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కనుక ఈ అంశంపై అధ్యయనం చేసి, సిఫారసులు చేసే బాధ్యతను 21వ న్యాయ కమిషన్ కు నివేదించినట్లు చెప్పారు. 21వ న్యాయ కమిషన్ కాల వ్యవధి 2018 ఆగస్ట్ 31న ముగియడంతో.. ఈ అంశాన్ని 22వ న్యాయ కమిషన్ చేపడుతుందని తెలిపారు.

21వ న్యాయ కమిషన్ కు ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని 2016 జూన్ లో కేంద్రం అప్పగించింది. ప్రస్తుత దశలో ఇది అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. ఏకాభిప్రాయం రాలేదని, వ్యక్తిగత మత చట్టాల్లోని వైవిధ్యాన్ని అనుసరించాలని అభిప్రాయపడింది. అదే సమయంలో రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చూడాలని సూచించింది.

More Telugu News