Anantapur District: స్మార్ట్‌ఫోన్‌కు బానిసై మతిస్థిమితం కోల్పోయిన యువకుడు.. దెయ్యం పట్టిందని మంత్రగాడి వద్దకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు

young man who has lost mental balance to a smartphone
  • ఇంటర్‌ చదువుకు స్వస్తి చెప్పి తాపీ పనులకు యువకుడు
  • కూలి డబ్బులతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు
  • నిద్రాహారాలు మాని స్మార్ట్‌ఫోన్‌కే అంకితం
  • మూడు నెలల తర్వాత మతిస్థిమితం కోల్పోయిన వైనం
  • మంత్రాలు వేయించి, తాయెత్తులు కట్టించిన తల్లిదండ్రులు
అందమైన జీవితాలను స్మార్ట్‌ఫోన్ ఎలా ఛిద్రం చేస్తోందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ.  అనంతపురం జిల్లా కణేకల్లు మండలంలోని బెణకల్లుకు చెందిన మహేశ్ (19) ఇంటర్ చదువుకు మధ్యలోనే మంగళం పాడేసి తాపీ పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. చదువు మానేసినా చెడు తిరగుళ్లు తిరగకుండా పనులకు వెళ్తున్నాడని తల్లిదండ్రులు సంతోషించారు. అయితే, వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు.

పనులకు వెళ్లగా వచ్చిన డబ్బులతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. అతడి జీవితం తారుమారు కావడానికి అదే కారణం అవుతుందని తెలుసుకోలేకపోయాడు. ఫోన్ చేతికి వచ్చినప్పటి నుంచి అది లేకుండా గడపలేకపోయాడు. పబ్‌జీ వంటి గేమ్స్‌కు బానిసయ్యాడు. రాత్రీపగలు అదే యావ. దీంతో పనులకు వెళ్లడం కూడా మానేశాడు. రాత్రుళ్లు నిద్ర మాని మరీ గేమ్స్ ఆడేవాడు. అలా దాదాపు మూడు నెలలపాటు నిద్రకు దూరమయ్యాడు. నిద్ర లేకపోవడంతో అది అతడి ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. మానసికంగా అదుపు తప్పాడు.

ఇతరులు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకోలేనంతగా అతడి మానసిక స్థితి దెబ్బతింది. అంతేకాదు, అతడేం మాట్లాడుతున్నాడో కూడా ఇతరులు అర్థం చేసుకోలేకపోయారు. మూడు నెలల క్రితం వరకు నిక్షేపంలా ఉన్న కుమారుడు ఇలా మారడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కుమారుడికి దెయ్యం పట్టి ఉంటుందని భావించి మంత్రగాడి వద్దకు తీసుకెళ్లారు. మంత్రాలు వేయించారు. తాయెత్తులు కట్టించారు.

అయినా ఫలితం లేకపోవడంతో నిన్న కణేకల్లులోని ఓ ప్రైవేటు ల్యాబ్‌కు తీసుకెళ్లారు. అక్కడి టెక్నీషియన్ తల్లిదండ్రుల నుంచి వివరాలు రాబట్టారు. చివరికి అతడి మానసిక స్థితి దెబ్బ తినడానికి స్మార్ట్‌ఫోన్ కారణమని చెప్పి తెలుసుకున్నారు. వైద్య నిపుణులను కలవాలని చెప్పి పంపించారు.
Anantapur District
Kanekal
Benakallu
Smart Phone

More Telugu News