Cocaine: అర్జెంటీనాలో ఘోరం... విషం కలిపిన డ్రగ్స్ తీసుకుని 20 మంది మృతి

  • డ్రగ్స్ ముఠాల మధ్య ఆధిపత్య పోరు
  • ప్రత్యర్థి ముఠాను దెబ్బతీసే యత్నం
  • కొకైన్ కు విషపు పూత
  • మూర్ఛలు, గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిపాలైన ప్రజలు
Cocaine with poison laced causes deaths in Argentina

దక్షిణ అమెరికా దేశాల్లో డ్రగ్స్ మాఫియాల అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఆధిపత్యం కోసం పలు డ్రగ్స్ గ్యాంగుల మధ్య అక్కడి దేశాల్లో తరచుగా పోరాటాలు జరుగుతుంటాయి. తాజాగా అర్జెంటీనాలో డ్రగ్స్ మాఫియా వికృతకోణం వెల్లడైంది. ప్రత్యర్థి డ్రగ్స్ ముఠాను దెబ్బతీసే ఉద్దేశంతో ఓ ముఠా ఎంతటి ఘాతుకానికి పాల్పడిందంటే.. కొకైన్ మత్తుపదార్థంలో విషం కలిపింది.

అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లో ఈ విషపూరిత కొకైన్ తీసుకున్న 20 మంది మృత్యువాతపడ్డారు. 74 మంది ఆసుపత్రులపాలయ్యారు. ట్రెస్ డి ఫెబ్రెరో ప్రాంతంలో కొకైన్ కొనుగోలు చేసినవారు దాన్ని పారవేయాలని పోలీసులు హెచ్చరించారు.

కాగా, కొకైన్ కు ఒపియేట్స్ అనే విషపదార్థం పూసి ఉంటారని భావిస్తున్నారు. దీని ప్రభావం నాడీ వ్యవస్థపై ఎక్కువగా ఉంటుంది. ఆసుపత్రి పాలైన వారిలో అత్యధికుల్లో మూర్ఛలు, గుండెపోటు లక్షణాలు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రెస్ డె ఫెబ్రెరో ప్రాంతంలో ఓ ఇంటిపై దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేశారు.

More Telugu News