Neha Shetty: హీరోయిన్‌కు ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా? అంటూ మీడియా ప్ర‌శ్న‌.. మండిప‌డ్డ హీరోయిన్!

  • తాజాగా ‘డీజే టిల్లు’ యూనిట్ మీడియా స‌మావేశం
  • పుట్టుమచ్చలపై ప్రశ్న వేసిన జ‌ర్న‌లిస్టు
  • అందుకు సంబంధించిన వీడియో వైర‌ల్
  • ఆ జ‌ర్న‌లిస్టుకు మహిళలపై ఎంత గౌరవం ఉందో?అంటూ హీరోయిన్ రిప్లై
Neha Shetty slams movie journalist

రొమాంటిక్ లవ్ స్టోరీ ‘డీజే టిల్లు’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేప‌థ్యంలో ఆ సినిమా యూనిట్ తాజాగా మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడింది. అలాగే, ట్రైల‌ర్ విడుద‌ల చేసింది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటించారు.

అయితే, ఈ సినిమా ట్రైల‌ర్‌లో హీరోయిన్ నేహాశెట్టిని నీ ఒంటిపై ఎన్ని పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయో చెప్పాల‌ని హీరో సిద్ధు అడుగుతాడు. దీంతో ఆ హీరోయిన్ 16 అని చెబుతుంది. ఈ సినిమా మీడియా స‌మావేశం సంద‌ర్భంగా ఓ జర్నలిస్టు ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ, హీరోయిన్ కు సినిమాలో కాకుండా.. రియల్ గా ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా? అని ఈ సినిమా హీరో సిద్ధుని అడిగాడు.

దీనిపై ఆ హీరో స‌మాధానం ఇవ్వ‌కుండా దాటేశాడు. అయితే, హీరోయిన్ నేహాశెట్టికి మాత్రం ఆ జ‌ర్న‌లిస్టు ప్రశ్నించిన తీరు కోపం తెప్పించింది. అత‌డు అడిగిన ప్ర‌శ్న‌కు సంబంధించిన వీడియోను ఓ అభిమాని పోస్ట్ చేయ‌గా, దానిపై నేహాశెట్టి స్పందిస్తూ... సినిమా ప‌బ్లిసిటీ సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ వేడుకల్లో ఇలాంటి ప్రశ్న ఎదురవడం దురదృష్టకరమని చెప్పింది. ఆ ప్ర‌శ్న అడిగిన జ‌ర్న‌లిస్టుకు మహిళలపై ఎంత గౌరవం ఉందో ఈ ప్రశ్న తెలియచేస్తుందని మండిప‌డింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

కాగా, నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ వివాదంపై స్పందించారు. హీరోయిన్‌కు కలిగిన ఇబ్బందికి ఆయ‌న‌ క్షమాపణలు చెప్పారు.  

More Telugu News