Visakhapatnam: వేటాడుతుండగా దూసుకొచ్చిన భారీ కొమ్ము కోనాం చేప.. కడుపులో కొమ్ముదిగబడి విశాఖలో మత్స్యకారుడి మృతి

Fisherman died in marlin fish attack in Visakhapatnam
  • జాలరి కడుపులో దిగబడిన కోనాం చేప కొమ్ము
  • తీవ్రంగా గాయపడిన మత్స్యకారుడు
  • తీరానికి చేరుకునేందుకు ఏడు గంటలకుపైగా సమయం
  • పరిస్థితి విషమించడంతో మృతి
సముద్రంలో చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ఓ చేప దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముత్యాలమ్మపాలెం పంచాయతీ శివారులోని జాలరిపేటకు చెందిన నొల్లి జోగన్న (45), ఒలిశెట్టి అప్పలరాజు, ఒలిశెట్టి కొర్లయ్య, ఒలిశెట్టి ముత్తురాజు, కాంబాల చినదేముడు, కంబాల మహేశ్ కలిసి ఆదివారం సాయంత్రం ఇంజిన్ బోటుపై సముద్రంలో వేటకు వెళ్లారు.

రాత్రంతా వేట కొనసాగించగా, సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో భారీ కొమ్ము కోనం చేప (మార్లిన్ ఫిష్) వారికి కనిపించింది. దీంతో దానికి గేలం వేసేందుకు జోగన్న సముద్రంలోకి దూకాడు. అదే సమయంలో చేప వేగంగా అతడిపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో చేపకు ఉండే భారీ కొమ్ము జోగన్న కడుపులో దిగబడింది. తీవ్రంగా గాయపడిన జోగన్నను వెంటనే బోటులోకి చేర్చి తీరానికి బయలుదేరారు.

జోగన్నకు వెంటనే వైద్య సాయం అందాల్సిన వేళ తీరానికి చేరుకునేందుకు ఏడు గంటలకుపైగా సమయం పట్టడంతో పరిస్థితి విషమించి జోగన్న మృతి చెందాడు. కాగా, చేపదాడిలో మత్స్యకారుడు మృతి చెందడం ఇదే తొలిసారని జాలర్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Visakhapatnam
Fisherman
Marlin Fish
Andhra Pradesh

More Telugu News