cobra bite: పాములు పట్టడం ప్రాణాలకు తెగించడమే.. స్వల్ప వ్యవధిలోనే రెండు ఘటనలు!

Kerala famous snake catcher Vava Suresh in hospital after the cobra bit him
  • కేరళలోని కొట్టాయంలో నిపుణుడు సురేశ్ కు కాటు
  • ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స
  • ఇంకా కోలుకోని భాస్కర్ నాయుడు
  • తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
విష సర్పాలను చాకచక్యంగా, సునాయాసంగా పట్టుకునే నిపుణులు ఎంతో మంది ఉన్నారు. శిక్షణతోనే ఈ అంశంలో నైపుణ్యం అలవడుతుంది. ఎంత ధైర్యంగా, సులభంగా పాములు పడుతున్నాడో? అంటూ చూసేవారికి అనిపించొచ్చు. కానీ, ఆ పని ప్రాణాలతో చెలగాటమని కొన్ని సందర్భాలు రుజువు చేస్తుంటాయి. వారం వ్యవధిలోనే జరిగిన రెండు ఘటనలు ఇందుకు నిదర్శనం.

కేరళ రాష్ట్రంలో ‘వావ సురేశ్’ గురించి తెలియని వారు తక్కువ. పాములు పట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. కానీ, అదే పాము కాటుతో ఆయన ఇప్పుడు ప్రాణం కోసం పోరాడుతున్నాడు. సోమవారం కొట్టాయం సమీపంలోని కురిచి గ్రామంలో పాము ఉందన్న సమాచారంతో పట్టుకునేందుకు సురేశ్ వెళ్లాడు. నాగు పామును (కోబ్రా) పట్టుకుని, సంచిలోకి జార విడిచే క్రమంలో కాటు వేసి తప్పించుకుని పోయింది.

దీంతో సురేశ్ ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇచ్చి, వెంటిలేటర్ పై మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. అయితే, సురేశ్ కు పాము కాటు వేయడం కొత్త కాదు. గతంలోనూ 300 సార్లు పాము కాటుకు గురయ్యాడు.

ఇక, తిరుపతిలో నాలుగు రోజుల క్రితం అటవీ ఉద్యోగి భాస్కర్ నాయుడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ కళాశాలలో కనిపించిన పామును బంధించేందుకు వెళ్లి ఆయన కాటుకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆయన ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాల్లో సమస్య కనిపించడంతో డయాలసిస్ కూడా చేశారు. వేలాది పాములను పట్టిన అనుభవం భాస్కర్ నాయుడి సొంతం. కానీ, వారు చేసేది దినదిన గండం ఉద్యోగమే. స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు నిపుణులకు ఈ పరిస్థితి ఎదురు కావడం గమనార్హం.
cobra bite
snake catcher
bhaskar naidu
tirupati
kerala

More Telugu News