samba shiva rao: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు క‌న్నుమూత‌

samba shiva rao passes away
  • అనారోగ్య కార‌ణాల‌తో తుదిశ్వాస‌
  • కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా సాంబ‌శివ‌రావు
  • ప‌లువురు ప్ర‌ముఖుల సంతాపం
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు (75) ఈ రోజు ఉద‌యం పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయ‌న‌ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్య కార‌ణాల వ‌ల్ల ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.

సాంబ‌శివ‌రావు మృతి ప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు. 'తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివరావు గారు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేసి తనదైన ముద్రవేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

'టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు గారి మృతి బాధాకరం. ప్రజలకి నిస్వార్థంగా సేవలు అందించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేసి చిరస్మరణీయులుగా నిలిచారు. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. సాంబశివరావు మృతిపట్ల దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా సంతాపం తెలిపారు. సాంబ‌శివ‌రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
samba shiva rao
Telugudesam
passes away

More Telugu News