Congress: ఇదెక్కడి విడ్డూరం.. చట్టబద్ధం చేయకుండానే క్రిప్టో కరెన్సీపై పన్ను విధిస్తారా?: కాంగ్రెస్ 

Congress fires on Nirmala sitharaman over tax on digital transactions
  • డిజిటల్ ఆస్తులపై పన్ను విధిస్తున్నట్టు చెప్పిన నిర్మల
  • క్రిప్టో కరెన్సీ బిల్లు తీసుకురాకుండానే పన్నులు ఎలా వేస్తారని నిలదీసిన సూర్జేవాలా
  • క్రిప్టో కరెన్సీపై ఇప్పటి వరకు చర్చే జరగలేదన్న మల్లికార్జున ఖర్గే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్రిప్టో కరెన్సీపై పన్ను వేస్తున్నట్టు ప్రకటించడాన్ని కాంగ్రెస్ ఆక్షేపించింది. క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయకుండానే.. అసలు సంబంధిత బిల్లు తీసుకురాకుండానే పన్ను ఎలా వసూలు చేస్తారని నిలదీసింది. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశానికి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సూర్జేవాలా ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. అసలు రెగ్యులేషన్ పరిస్థితి ఏంటి? క్రిప్టో ఎక్స్చేంజీల నియంత్రణ సంగతేంటి? ఇన్వెస్టర్ల రక్షణ ఏంటని ప్రశ్నలు సంధించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కూడా ఈ విషయాన్ని తప్పుబట్టారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చా జరగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి చట్టమూ లేదని, కానీ బడ్జెట్‌లో మాత్రం దాని గురించి ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా, నిర్మల తన బడ్జెట్ ప్రసంగంలో.. దేశంలో వర్చువల్ డిజిటల్ కరెన్సీ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, కాబట్టి దీనిపై పన్ను విధిస్తున్నట్టు చెప్పారు. వర్చువల్ ఆస్తుల బదిలీపై 30 శాతం చొప్పున పన్ను విధిస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు ఒక శాతం టీడీఎస్ కూడా విధిస్తున్నట్టు పేర్కొన్నారు. వర్చువల్ ఆస్తులు గిఫ్ట్ రూపంలో అందించినా ఇదే పన్ను వర్తిస్తుందని తెలిపారు.
Congress
Crypto Currency
Nirmala Sitharaman
Budget

More Telugu News