Congress: అఖిలేశ్ పై తమ అభ్యర్థిని బరిలో దించరాదని కాంగ్రెస్ నిర్ణయం

  • యూపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • చివరి నిమిషంలో కాంగ్రెస్ నిర్ణయం
  • నామినేషన్ పత్రాలు నింపవద్దని అభ్యర్థికి ఆదేశం
  • కర్హాల్ లో అఖిలేశ్ వర్సెస్ ఎస్పీ సింగ్ బఘేల్
Congress decides to not contest in Karhal against Samajwadi chief Akhilesh Yadav

అసెంబ్లీ ఎన్నికల వేడితో అట్టుడుకుతున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థిని బరిలో దింపరాదని కాంగ్రెస్ నిర్ణయించింది.

ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గంపై ఇప్పుడు జాతీయస్థాయిలో ఆసక్తి ఏర్పడింది. అధికార బీజేపీకి గట్టి సవాల్ విసురుతున్న సమాజ్ వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తుండగా, ఆయనపై కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ ను బీజేపీ బరిలో నిలిపింది.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. జ్ఞానవతి దేవికి ఇచ్చిన టికెట్ ను చివరి నిమిషంలో రద్దు చేసింది. నామినేషన్ పత్రాలు నింపవద్దంటూ ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హడావిడిగా ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు మెయిన్ పురి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ కులశ్రేష్ఠ వెల్లడించారు. ఇవాళ నామినేషన్లకు తుదిగడువు కాగా, కాంగ్రెస్ నిర్ణయంతో ఇక్కడ ప్రధానంగా ద్విముఖ పోరు నెలకొంది.

1993 నుంచి కర్హాల్ నియోజకవర్గం సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. 2002లో మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఇక, అఖిలేశ్ తొలిసారి అసెంబ్లీ బరిలో దిగుతున్నారు. తమకు బాగా పట్టున్న కర్హాల్ నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నారు. అఖిలేశ్ గతంలో నాలుగు పర్యాయాలు లోక్ సభ సభ్యుడిగా గెలిచారు.

అఖిలేశ్ పై పోటీ చేస్తున్న సత్యపాల్ సింగ్ బఘేల్ ది కూడా ఆసక్తికరమైన చరిత్రే. ఆయన గతంలో ఉత్తరప్రదేశ్ లో పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. అప్పట్లో ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా వున్నప్పుడు ఆయనకు భద్రతాధికారిగా వ్యవహరించారు. బఘేల్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది ములాయం సింగ్ కాగా, తదనంతర కాలంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

బఘేల్... అఖిలేశ్ పై పోటీ చేయడం ఇది రెండోసారి. 2009లో ఫిరోజాబాద్ లోక్ సభ స్థానం నుంచి అఖిలేశ్ పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బఘేల్ ఆగ్రా ఎంపీగా ఉన్నారు. ఆయన మిలిటరీ సైన్స్ సబ్జెక్టు ప్రొఫెసర్ గానూ పనిచేశారు.

More Telugu News