digital assets: క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై వడ్డింపు.. 30 శాతం పన్ను విధింపు

30 percent tax on proceeds of virtual digital assets
  • కొనుగోలు వ్యయాలకే మినహాయింపు
  • మిగిలిన లాభంపై పన్ను అమలు
  • ఇతర లాభ, నష్టాలతో సర్దుబాటుకు నో
  • ఒక శాతం టీడీఎస్ అమలు
వర్చువల్ అసెట్స్ (డిజిటల్ రూపంలో కలిగి ఉండే ఆస్తులు/డిజిటల్ అసెట్స్)పై లాభాలు సమకూరితే పన్ను ఎంత చెల్లించాలన్నది ఇప్పటి వరకు చట్ట పరంగా నిర్దేశించలేదు. దీంతో పన్ను విషయంలో అయోమయం నెలకొని ఉంది. పర్యవసానంగా కొందరు క్రిప్టో కరెన్సీలు, ఎన్ఎఫ్ టీ (నాన్ ఫంజిబుల్ టోకెన్లు) వంటి ఆస్తుల విక్రయంపై వచ్చిన లాభాలను రిటర్నుల్లో చూపించడం లేదు.

కొందరు రిటర్నుల్లో చూపించినా, డెట్ సాధనాలకు మాదిరే పన్ను చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ అసెట్స్ పై పన్ను పరంగా అస్పష్టతకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెరదించారు. 30 శాతం పన్నును బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. కొనుగోలు కోసం చేసిన వ్యయం మినహా లాభం నుంచి దేనినీ మినహాయించరు.

డెట్ సాధనాలను మూడేళ్లకు పైగా కలిగి ఉన్న తర్వాత విక్రయించినప్పుడు.. వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసి మిగిలిన దానిపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అటువంటి ప్రయోజనం డిజిటల్ అసెట్స్ లాభాలపై ఉండదు. అలాగే, ఇతర మార్గాల్లోని మూలధన లాభ, నష్టాలను డిజిటల్ అసెట్స్ లాభ, నష్టాల మధ్య సర్దుబాటుకు అవకాశం ఉండదు.

డిజిటల్ అసెట్స్ ను మరొకరికి బదిలీ చేసినా విక్రయంగానే పరిగణిస్తారు. ఈ లావాదేవీలకు సంబంధించి చేసే చెల్లింపులపై ఒక శాతం టీడీఎస్ అమలవుతుంది. వర్చువల్ డిజిటల్ అసెట్స్ నుంచి వచ్చే ఆదాయంపైనా 30 శాతం పన్ను పడుతుంది.

మనదేశంలో క్రిప్టో కరెన్సీల నియంత్రణకు సంబంధించి చట్టం అంటూ ఏదీ లేదు. దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే నియంత్రణ చట్టం తీసుకురావాలని కేంద్రం భావించింది. క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఉంటుందన్న ఆందోళనలతో మరింత విస్తృత చర్చ అనంతరం ముందుకు వెళ్లాలని వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పన్ను అంశంపై ఆర్థిక మంత్రి స్పష్టత తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
digital assets
virtual assets
30 percent tax
budget
tax

More Telugu News