Shiva Karthukeyan: శివకార్తికేయన్ 'డాన్' రిలీజ్ డేట్ ఖరారు!

  • 'డాక్టర్'తో హిట్ కొట్టిన శివ కార్తికేయన్
  • 'డాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు
  •  విలన్ పాత్రలో ఎస్.జె. సూర్య
  • మార్చి 25వ తేదీన భారీ విడుదల
DON release date confirmed

శివ కార్తికేయన్ హీరోగా ఇటీవల వచ్చిన 'డాక్టర్' తమిళనాట భారీ విజయాన్ని సాధించింది. సొంత బ్యానర్లో ఆయన నిర్మించిన ఈ సినిమా, చాలా తక్కువ సమయంలో 100 కోట్లను వసూలు చేసింది. ఆ తరువాత సినిమాగా ఆయన 'డాన్' చేశాడు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ  సినిమాకి శివ కార్తికేయన్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. మార్చి 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, కామెడీ ప్రధానంగా కొనసాగుతుంది.

శివ కార్తికేయన్ జోడీగా 'డాక్టర్' సినిమాలో మెప్పించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలోను కథానాయికగా అలరించనుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఎస్.జె. సూర్య కనిపించనున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. ఈ సినిమాతో శివ కార్తికేయన్ మరో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.

More Telugu News