Karimnagar: కరీంనగర్ రోడ్డు ప్రమాద ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి.. 100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన బాలుడు!

Karimnagar road accident police reveal shocking facts
  • కారు నడిపిన 16 ఏళ్ల బాలుడు
  • వెంట అతడి స్నేహితులు
  • బాలురతోపాటు కారు ఇచ్చినందుకు నిందితుడి తండ్రి కూడా అరెస్ట్
  • బ్రేకుకు బదులుగా యాక్సిలేటర్ తొక్కడం వల్లే ప్రమాదం!
కరీంనగర్‌లోని కమాన్ సమీపంలో నిన్న తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు గుడిసెలో నిద్రిస్తున్న నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. వీరంతా కొలిమి పని చేసుకుని జీవిస్తున్న కుటుంబాలకు చెందినవారు. అందరూ బంధువులే. ప్రమాదానికి కారణమైన కారును ఓ బాలుడు నడుపుతుండగా, అందులో అతడి ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు.

ప్రమాద సమయంలో కారు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, కారుపై 9 చలాన్లు ఉన్నాయి. ప్రమాద  సమయంలో కారు నడుపుతున్న 16 ఏళ్ల బాలుడితోపాటు 17 ఏళ్ల వయసున్న అతడి ఇద్దరి స్నేహితులను అరెస్ట్ చేశారు. అలాగే, బాలుడికి కారు ఇచ్చి ప్రమాదానికి కారణమైన అతడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడైన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వెంట ఉన్న ఇద్దరు స్నేహితులు పదో తరగతి చదువుతున్నట్టు పోలీసులు తెలిపారు. స్నేహితులైన వీరంతా తరచూ కారులో షికారుకు వెళ్లేవారు. నిన్న కూడా అలాగే కారులో బయటకు వచ్చారు. పొగమంచు కురుస్తున్నా కారును వేగంగా నడిపారు. ఈ క్రమంలో బ్రేకుకు బదులు యాక్సిలేటర్‌ను బలంగా తొక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Karimnagar
Road Accident
Telangana

More Telugu News