Andhra Pradesh: పింఛను కోసం ఏపీ ప్రభుత్వంతో పోరాడి విజయం సాధించిన వృద్ధురాలు!

A Pensioner win over AP government on pension issue
  • నెల్లూరు జిల్లా నావూరుపల్లిలో ఘటన
  • వివిధ కారణాలు చూపుతూ వృద్ధురాలి పింఛను ఆపేసిన వైనం
  • అధికారులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం నిల్
  • హైకోర్టులో విజయం

వివిధ కారణాలు చూపుతూ ఆపేసిన తన పింఛను కోసం కోర్టుకెక్కిన ఓ వృద్ధురాలు విజయం సాధించింది. పింఛనును వెంటనే పునరుద్ధరించడంతోపాటు ఎప్పటి నుంచి పింఛను ఆపేశారో ఆ మొత్తం కూడా లెక్కకట్టి ఆమెకు చెల్లించాలని ఏపీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం నావూరుపల్లికి చెందిన కాకర్ల సరోజనమ్మ (65) 2019 నుంచి పింఛను అందుకుంటున్నారు. జనవరి 2020 నుంచి ఆమెకు పింఛను రావడం ఆగిపోయింది. దీంతో అధికారులను కలిసి ప్రశ్నిస్తే.. 24 ఎకరాల పొలం ఉండడంతోనే పింఛను ఆపేసినట్టు చెప్పారు.

అయితే, తనకున్నది 4.90 ఎకరాల మెట్ట భూమి మాత్రమేనని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇక లాభం లేదని గతేడాది అక్టోబరులో సరోజనమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లో సరోజనమ్మ పింఛనును పునరుద్ధరించాలని ఆదేశించింది. అలాగే, ఆగిన కాలానికి సంబంధించి మొత్తాన్ని లెక్కకట్టి దానిని కూడా చెల్లించాలని సూచించింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికారులు గత నెలలో సరోజనమ్మ పింఛను పునరుద్ధరించారు. అయితే, ఆగిన 22 నెలల కాలానికి సంబంధించిన పింఛను సొమ్ము మాత్రం చెల్లించలేదు. దీంతో సరోజనమ్మ మరోమారు హైకోర్టును ఆశ్రయించారు. అధికారులపై కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆగమేఘాల మీద 22 నెలల పింఛను మొత్తం రూ.47,250లను నిన్న సరోజనమ్మకు అందించారు.

  • Loading...

More Telugu News