Overseas Openers: ఐపీఎల్ మెగా వేలంలో ఐదుగురు విదేశీ ఆటగాళ్ల కోసం పోటీ ఎక్కువే!

  • వార్నర్, డుప్లెసిస్ కు మంచి పోటీ
  • జేసన్ రాయ్, బెయిర్ స్టోవ్, డీకాక్ కూ మంచి ధర
  • మెరుగైన స్ట్రయిక్ రేటు వీరి సొంతం
  • ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం
5 Overseas Openers Who Can Start A Bidding War In IPL Mega Auction

ఐపీఎల్ లో ఆడేందుకు విదేశీ ఆటగాళ్లు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తక్కువ వ్యవధిలోనే కోట్లాది రూపాయల ఆదాయానికి తోడు, ఎంతో ప్రజాదరణకు వేదిక కావడం ఇందుకు కారణం. ఇప్పటికే ఐపీఎల్ లో సత్తా చాటిన విదేశీ క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఐదుగురికి మాత్రం ఈ విడత వేలంలో మంచి పోటీ ఏర్పడనుంది. మంచి ధరను కూడా వీరు పొందనున్నారు.

బెంగళూరులో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం నిర్వహించనున్నారు. వేలంలో ఎవరిని సొంతం చేసుకోవాలి, ఎంత వరకు వారికి ఆఫర్ ఇవ్వొచ్చనే లెక్కల్లో ఫ్రాంచైజీలు మునిగిపోయాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ విడిచి పెట్టిన ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కోసం ఎక్కువ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది.

ఓపెనర్ గా నిలదొక్కుకుని, మంచి స్కోరుకు పునాది వేయడంలో వార్నర్ సిద్ధహస్తుడు. 149 ఐపీఎల్ మ్యాచుల్లో 5,449 పరుగుల రికార్డు అతడి సొంతం. పైగా కెప్టెన్ గానూ మంచి అనుభవం ఉంది. ఇటీవలే టీ20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియాకు తెచ్చిపెట్టాడు. కెప్టెన్ కోసం అన్వేషిస్తున్న బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు వార్నర్ కోసం పోటీ పడొచ్చు.

ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టోవ్ కూడా సన్ రైజర్స్ మాజీ జట్టు సభ్యుడే. 142.19 స్ట్రయిక్ రేటు అతడికి ఉంది. ఐపీఎల్ టోర్నమెంట్ లో ఎంతో మంది ఓపెనర్ల కంటే ఇది మెరుగైన రేటు. ఓపెనర్ల కొరతను ఎదుర్కొంటున్న కేకేఆర్ జట్టు ఇతడి కోసం పోటీపడే అవకాశం కనిపిస్తోంది.

ఇంగ్లాండ్ క్రికెటర్, సన్ రైజర్స్ మరో మాజీ ఆటగాడు జేసన్ రాయ్ క్రీజ్ లో నిలదొక్కుకుంటే చెలరేగిపోతాడు. ఇతడి కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడొచ్చు.

దక్షిణాఫ్రికాకు చెందిన ఫాప్ డుప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చివరి సీజన్ లో మెరుగైన ప్రదర్శన చేశాడు. జట్టు కప్పు గెలవడంలో డుప్లెసిస్ పాత్ర కూడా కీలకమైనదే. చాలా ఏళ్లుగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇతడి కోసం సీఎస్కే తో పాటు ఇతర జట్లు పోటీ పడొచ్చు.

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, మంచి స్ట్రయిక్ రేటు ఉన్న క్వింటన్ డీకాక్ కూడా వేలంలో మంచి ఆకర్షణగా నిలవనున్నాడు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ గా మంచి ప్రదర్శనలు ఎన్నో ఇచ్చాడు.

More Telugu News