హీరోగా ఎంట్రీ ఇస్తున్న తమిళ డైరెక్టర్ శంకర్ తనయుడు!

29-01-2022 Sat 10:27
  • డైరెక్టర్ గా శంకర్ కి విపరీతమైన ఇమేజ్
  • తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ సొంత సినిమా
  • సీక్వెల్ గా రూపొందనున్న 'కాదల్ 2'
  • ఆల్రెడీ హీరోయిన్ గా చేస్తున్న కూతురు
Kaadhal Movie Sequel
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ గురించి .. ఆయనకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఆయన చేసిన సినిమాలు కమల్ .. రజనీ .. అర్జున్ .. విక్రమ్ .. ప్రశాంత్ వంటి హీరోల కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలుగా నిలిచిపోయాయి. అలాంటి శంకర్ ఇప్పుడు తన తనయుడు 'అర్జిత్'ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

శంకర్ సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని చాలా కాలమే అయింది. ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను ఇతర దర్శకులతో కలిసి చేస్తూ వెళుతున్నారు. ఈ బ్యానర్లోనే తన తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి ఆయన రెడీ అవుతున్నారని అంటున్నారు. అందుకోసం ఆయన 'కాదల్' సీక్వెల్ ను ఎంచుకోవడం విశేషం.

తమిళనాట 2004లో వచ్చిన 'కాదల్' అక్కడ చరిత్ర సృష్టించింది. భరత్ - సంధ్య జంటగా నటించిన ఈ సినిమాకి బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమా 'ప్రేమిస్తే' పేరుతో భారీ వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా సీక్వెల్ తోనే 'అర్జిత్' ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఆల్రెడీ శంకర్ కూతురు 'అదితి' కూడా హీరోయిన్ గా రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' .. చరణ్ 15వ సినిమా సెట్స్ పై ఉన్నాయి.