పబ్‌జీకి బానిసైన పాక్ బాలుడు.. మొత్తం కుటుంబాన్నే అంతం చేశాడు!

29-01-2022 Sat 10:08
  • పబ్‌జీ పిచ్చిలో పడి చదువును నిర్లక్ష్యం చేసిన బాలుడు
  • మందలించిన తల్లి, అన్న, అక్కాచెల్లెళ్ల కాల్చివేత
  • ఘటన ఆలస్యంగా వెలుగులోకి
Pak Boy Shoots Dead Entire Family Under PUBG Influence
పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పబ్ జీ ఆటకు బానిసైన ఓ బాలుడు తల్లిని, ముగ్గురు తోబుట్టువులను కాల్చి చంపాడు. పంజాబ్ ప్రావిన్స్‌లో గత ఆదివారం ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది.

పోలీసుల కథనం ప్రకారం.. లాహోర్‌లోని కహ్నా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు పబ్‌జీ ఆటకు బానిసయ్యాడు. ఫలితంగా మానసిక సమస్యలు కూడా అతడిని చుట్టుముట్టాయి. పబ్‌‌జీ ఆటలో పడి చదువును పక్కనపెట్టేయడంతో తల్లి నహీద్ ముబారక్ (45) మందలించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలుడు ఇంట్లో ఉన్న తుపాకితో తల్లి, నిద్రిస్తున్న సోదరుడు తైమూర్ (22), 17, 11 సంవత్సరాలున్న అక్కాచెల్లెళ్లను కాల్చి చంపాడు.

ఆ తర్వాతి రోజు ఉదయం ఇరుగుపొరుగు వారి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నాడు. తొలుత తనకేమీ తెలియదని, ఘటన జరిగినప్పుడు తాను మేడపై ఉన్నానని పోలీసులను నమ్మబలికే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసుల దర్యాప్తులో బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది.

కాగా, భర్త నుంచి విడాకులు తీసుకున్న నిందితుడి తల్లి వ్యక్తిగత రక్షణ నిమిత్తం కొంతకాలం క్రితం తుపాకి కోసం దరఖాస్తు చేసుకుని తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడైన బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.