ఎవరినీ కాపీ కొట్టాలనుకోవడం లేదు.. లక్నో కొత్త జట్టు నిర్మాణంపై గౌతమ్ గంభీర్

29-01-2022 Sat 09:59
  • మాదైన విధానం మాకు ఉంది
  • జట్టు నిర్మాణం గొప్ప అవకాశం
  • గతంలో సాధ్యం కానిది చేసి చూపిస్తామన్న గౌతమ్ 
Gautam Gambhir Explains Lucknow Super Giants Strategy For IPL 2022
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్ 2022 సీజన్ తో కొత్తగా ప్రయాణం మొదలు పెట్టనుంది. ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు ఈ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను మెంటార్ గా నియమించుకుంది. ఇప్పుడు జట్టు నిర్మాణంలో అతడు కీలకంగా వ్యవహరించబోతున్నాడు.

మరోపక్క, ఇప్పటికే కేఎల్ రాహుల్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ లను వేలానికి ముందే ఈ ఫ్రాంచైజీ తీసుకుంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరులో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేయనుంది.

ఈ క్రమంలో, జట్టు నిర్మాణంపై గౌతమ్ గంభీర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘ఒక ఆస్తి (కొత్త జట్టు)ని ఏర్పాటు చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మేము ఎవరినీ కాపీ కొట్టాలనుకోవడం లేదు. మాకంటూ ఓ విధానం ఉంది. మాదైన వారసత్వాన్ని కలిగి ఉండాలి.

సంజీవ్ సర్ పూణె ఫ్రాంచైజీని లోగడ కలిగి ఉన్న సమయంలో ఒక్క పరుగు తేడాతో టైటిల్ ను కోల్పోయారు. నాడు సాధించలేని దాన్ని మేము ఇప్పుడు సాధించగలగాలి అనేది మాకు ఓ పెద్ద ఛాలెంజ్.  ఇది ఏడాదిలో సాధ్యమవుతుందని హామీ ఇవ్వలేము. దీర్ఘకాలిక ప్రక్రియ. కేవలం ఈ ఏడాది కోసమే ఆలోచించేది కాదు ఇది’’ అని గౌతమ్ వివరించాడు.