ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. ఒకే స్థానం నుంచి నామినేషన్లు వేసిన ఆజంఖాన్ భార్య, కుమారుడు

29-01-2022 Sat 09:42
  • ఫోర్జరీ, భూ కబ్జా కేసులో జైలులో ఉన్న ఎంపీ ఆజంఖాన్
  • 2020లో కోర్టులో లొంగిపోయిన ఆజంఖాన్, భార్య, కుమారుడు
  • ఒకే నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన తల్లీకుమారులు
Azam Khans Son Wife Samajwadi Candidates From Same UP Seat
వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు జంటలు బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎంపీ ఆంజంఖాన్ కుమారుడు మహమ్మద్ అబ్దుల్లా, ఆజంఖాన్ భార్య తనీజ్ ఫత్మా ఒకే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. రామ్‌పూర్ జిల్లాలోని సువార్ నియోజకవర్గం నుంచి నిన్న ఇద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు. తల్లీకుమారులు ఇద్దరూ ఎస్పీ ఆభ్యర్థులుగానే నామినేషన్లు వేయడం గమనార్హం.

కాగా, ఫోర్జరీ, భూ ఆక్రమణ కేసులో ఆజంఖాన్, ఆయన భార్య, కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2020లో వారు రామ్‌పూర్ కోర్టులో లొంగిపోయారు. ఫత్మా అదే ఏడాది బెయిలుపై విడుదల కాగా, అబ్దుల్లా ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, 8సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి, ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆజంఖాన్ మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు.