కొడుకు కోసం తపిస్తున్న తల్లి.. అమెరికాలో ఉంటున్న వరంగల్ వ్యక్తికి అత్యవసర వీసా ఇప్పించిన కేటీఆర్

29-01-2022 Sat 08:33
  • ఈ-వీసా రద్దు కారణంగా అమెరికాలోనే వినయ్‌రెడ్డి
  • చావుబతుకుల్లో ఉన్న తల్లిని చూసే మార్గం లేక ఆవేదన
  • వినయ్‌రెడ్డి ట్వీట్‌కు తక్షణం స్పందించిన కేటీఆర్
  • అత్యవసర వీసా జారీ చేసిన రాయబార కార్యాలయ అధికారులు
KTR Responded to a Tweet From America
ట్విట్టర్ ద్వారా తన దృష్టికి వచ్చే సమస్యలను తీర్చడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందువరుసలో ఉంటారు. ఈ-వీసా రద్దు కావడంతో అమెరికాలోనే చిక్కుకుపోయి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసే మార్గం లేక తల్లడిల్లుతున్న ఓ వ్యక్తికి కేటీఆర్ సాయం చేశారు.

వరంగల్‌కు చెందిన మాదాడి వినయ్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌కు గురువారం ట్వీట్ చేస్తూ.. తన తల్లి చావుబతుకుల్లో ఉందని, ఒక్కగానొక్క కుమారుడినైన తన కోసం పరితపిస్తోందని పేర్కొన్నారు. అమెరికాలో ఈ-వీసాలను రద్దు చేశారని, ఫలితంగా వరంగల్ వచ్చే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వరంగల్ వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు.

వినయ్‌రెడ్డి ట్వీట్‌కు తక్షణం స్పందించిన కేటీఆర్.. విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. సానుకూలంగా స్పందించిన అధికారులు వినయ్‌రెడ్డికి అత్యవసర వీసా మంజూరు చేశారు. దీంతో నిన్న ఉదయం ఆయన హైదరాబాద్ బయలుదేరారు.