China: పాకిస్థాన్‌కూ ఓ స్పేస్ సెంటర్.. చైనా కీలక ప్రకటన

  • పాక్-చైనా బంధం మరింత బలోపేతం
  • మిత్రదేశం కోసం అంతరిక్ష ప్రణాళిక
  • కమ్యూనికేషన్ ఉపగ్రహాల అభివృద్ధి
  • అంతరిక్ష పరిశోధనకు రెండు దేశాల మధ్య ఒప్పందం
China to build space centre more satellites for Pakistan

చైనా-పాకిస్థాన్ బంధం మరింత రాటుదేలుతోంది. పాకిస్థాన్‌లో ఏ ప్రభుత్వం ఉన్నా చెట్టపట్టాలేసుకుని తిరిగే చైనా తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. మిత్రదేశం పాకిస్థాన్ కోసం ప్రత్యేకంగా స్పేస్ సెంటర్ నిర్మిస్తామని, మరిన్ని ఉపగ్రహాలు ప్రయోగిస్తామని పేర్కొంది. ఈ మేరకు చైనా ఓ ప్రణాళికను ప్రకటించినట్టు స్టేట్ కౌన్సిల్ విడుదల చేసిన ‘చైనాస్ స్పేస్ ప్రోగ్రామ్: ఎ 2021 పెర్స్‌పెక్టివ్’ అనే శ్వేత పత్రంలో పాకిస్థాన్ పలుమార్లు పేర్కొంది.

పాకిస్థాన్ కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహాలను అభివృద్ధి చేయడం, పాక్ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి సహకరించడానికి చైనా ప్రాధాన్యమిస్తుందని ఈ పేపర్‌లో పేర్కొన్నట్టు పాక్ తెలిపింది. కాగా, ప్రస్తుతం చైనా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని (స్పేస్ స్టేషన్) నిర్మించుకుంటోంది. ఈ ఏడాదిలోనే ఇది పూర్తి చేయాలని గట్టి పట్టుదలగా ఉంది.

2018లో రెండు ఉపగ్రహాలు.. ఆప్టికల్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం పీఆర్ఎస్ఎస్-1, చిన్నపాటి అబ్జర్వేషన్ క్రాఫ్ట్ ‘పాక్ టీఈఎస్-1ఎ’లను ప్రయోగించేందుకు పాకిస్థాన్‌కు చైనా సాయం చేసింది. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఈ రెండు దేశాలు ఇప్పటికే ఒప్పందంపై సంతకాలు చేశాయి. మిత్రదేశాల మధ్య అంతరిక్ష సహకారంలో ఇది సరికొత్త దశను సూచిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే, పాకిస్థాన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం (పీఆర్‌ఎస్‌ఎస్‌-1), వెనిజులా రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ (వీఆర్‌ఎస్‌ఎస్‌-2), సుడాన్‌ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌ఎస్‌-1), అల్జీరియన్ కమ్యూనికేషన్స్ శాటిలైట్ (అల్కోమ్‌శాట్-1)లను కక్ష్యలో పెట్టే ప్రక్రియను చైనా పూర్తిచేసిందని నిన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో పాక్ పేర్కొంది.

More Telugu News