తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి ద్విముఖ వ్యూహం: సీఎం కేసీఆర్

28-01-2022 Fri 20:21
  • తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలన్న కేసీఆర్
  • ప్రగతిభవన్ లో కీలక సమీక్ష
  • డ్రగ్స్ మాఫియాపై పోరు సాగించాలని వెల్లడి
  • పోలీసులకు అధునాతన ఆయుధాలు
CM KCR reviews on drugs control in state
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల అంశంపై ఆయన ఇవాళ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించారు.

మొదటి వ్యూహం ప్రకారం... ఇప్పటికే డ్రగ్స్ కు బానిసైన వారిని గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో మళ్లీ మామూలు మనుషులను చేసే కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుందని తెలిపారు.

రెండో వ్యూహం ప్రకారం... డ్రగ్స్ వినియోగం పట్ల ఆకర్షితులవుతున్న యువతను గుర్తించడం, వారికి అందుతున్న డ్రగ్స్ ఏ నెట్వర్క్ నుంచి వస్తున్నాయో గుర్తించి నిర్మూలించే కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

డ్రగ్స్ మాఫియాపై పోరులో రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అధునాతన ఆయుధాలను ఉపయోగించాలని అన్నారు. మెరికల్లాంటి పోలీసు అధికారులను రంగంలోకి దింపాలని, డ్రగ్స్ మాఫియా మళ్లీ కోలుకోకుండా దెబ్బకొట్టాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని, నేరస్తులను గుర్తించి పట్టుకునే దిశగా తెలంగాణ పోలీసు అధికారుల బృందానికి తగిన తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు. ఆయా విధానాలపై అవగాహన కోసం అవసరమైతే విదేశాల్లో పర్యటించాలని అధికారులకు సూచించారు.

డ్రగ్స్ కట్టడిలోనూ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ నియంత్రణ కోసం సమాజం నుంచి సహకారం తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం కేసీఆర్ ఉద్బోధించారు. గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో అవగాహన సదస్సులు నిర్వహించి, డ్రగ్స్ వ్యతిరేక చైతన్యం కలిగించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఈ అంశంలో అవగాహన కల్పించాలని తెలిపారు.