ఉద్యోగులు ఇప్పుడు మాటమార్చి మరోలా వ్యవహరించడం సరికాదు: సజ్జల

28-01-2022 Fri 19:04
  • కొనసాగుతున్న ఉద్యోగుల ఆందోళనలు
  • చర్చలకు రావాలని పిలిచామన్న సజ్జల
  • హెచ్ఆర్ఏ శ్లాబులపై చర్చకు సిద్ధమని ప్రకటన
  • డీడీవోలను అడ్డుకుంటున్నారని ఆరోపణ
Sajjala slams employees union leaders
ఉద్యోగులతో పీఆర్సీ, ఇతర డిమాండ్లపై కొనసాగుతున్న ప్రతిష్టంభనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు అందుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగుల ఆందోళన, ఉద్యోగ సంఘాల నేతల 3 డిమాండ్లకు సంబంధంలేదని అన్నారు.

హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించడంలేదని తెలిపారు. హెచ్ఆర్ఏ శ్లాబులపై నష్టం జరిగిందని భావిస్తే చర్చలకు తాము సిద్ధమని సజ్జల ప్రకటించారు. ఉద్యోగులు చర్చలకు వచ్చుంటే పాత విధానంలో జీతాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించేదని వ్యాఖ్యానించారు.

చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడామని, అయితే ఫిట్ మెంట్ పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెప్పాయని వెల్లడించారు. కానీ ఇప్పుడు ఉద్యోగులు మాటమార్చి మరోలా వ్యవహరించడం సరికాదని అన్నారు. వేతన బిల్లులు రూపొందించే డీడీవోలను కూడా ఉద్యోగ సంఘాలు అడ్డుకుంటున్నాయని సజ్జల ఆరోపించారు.