సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల డ్రామా: చంద్రబాబు

28-01-2022 Fri 17:44
  • త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
  • పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం
  • ఏపీపై కేంద్రం దృష్టి సారించాలని సూచన
  • రాష్ట్రం అంధకారంలోకి వెళుతోందని వ్యాఖ్యలు
Chandrababu held meeting with TDP MPs
ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఇవాళ టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు.

 ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఏపీ సర్కారు తీరుపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు. సర్కారు ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్రం అంధకారంలోకి వెళుతోందని విమర్శించారు.

28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం తెచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఎవరి కోసం? అని నిలదీశారు. పాలన అంటే అప్పు చేయడం, దోచుకోవడం అన్నట్టుగా మారిందని అన్నారు. సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల డ్రామా మొదలుపెట్టారని వ్యాఖ్యానించారు.