వివాదంలో సింగర్ సునీత భర్త.. వివరణ ఇచ్చిన ఆయన సంస్థ!

28-01-2022 Fri 17:33
  • 24న గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారు
  • ఒక సినిమా గురించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు
  • వారి కోరిక మేరకు ఆ కంటెంట్ ను ఆరోజే తొలగించాం
Singer Sunitha husbands company gives clarification on film issue
ప్రముఖ సినీ గాయని సునీత భర్త రామ్ వీరపనేని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మ్యాంగో పేరుతో ఒక డిజిటల్ మీడియా కంపెనీని ఆయన నిర్వహిస్తున్నారు. తెలుగు సినిమాల డిజిటల్ రైట్స్ కొని వాటిని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంస్థ విడుదల చేస్తుంటుంది. అయితే, ఓ సినిమాలో గౌడ మహిళలను ఇబ్బందికంగా చూపించారంటూ ఆయన కార్యాలయానికి వెళ్లి ఆయనతో గౌడ సంఘాలకు చెందిన కొందరు నేతలు గొడవ పడ్డారు. తాజాగా ఈ వివాదంతో రామ్ సంస్థ అధికారికంగా స్పందించింది.

ఈ నెల 24న తాము గౌడ కులానికి చెందిన వాళ్లమంటూ కొందరు వచ్చారని... ఒక సినిమా గురించి అభ్యంతరాలను వ్యక్తం చేశారని... ఆ కంటెంట్ ను యూట్యూబ్ నుంచి తొలగించాలని వారు కోరారని రామ్ సంస్థ ప్రకటనలో తెలిపింది. అయితే ఆ సినిమా అప్పటికే సెన్సార్ సర్టిఫికెట్ తో థియేటర్లలో విడుదలైందని... అయినప్పటికీ స్త్రీలను కించపరుస్తూ చూపించే ఉద్దేశం తమకు లేనందున వారు చెప్పిన రోజునే దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించామని పేర్కొంది. ఈ వీడియో కారణంగా ఎవరి మనోభావాలనైనా పొరపాటున నొప్పించి ఉంటే క్షమాపణలు తెలియజేస్తున్నామని చెప్పారు.