Somu Veerraju: కడప ప్రజల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు... నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సోము వీర్రాజు

  • ప్రాణాలు తీసే వాళ్ల జిల్లాలోనూ ఎయిర్ పోర్టులు నిర్మించామన్న సోము
  • కడప జిల్లా ప్రజలను ఉద్దేశించి కాదని వివరణ
  • వివేకా హత్య కేసు నేపథ్యంలో వ్యాఖ్యలు చేశానని వెల్లడి
Somu Veerraju explains his statement about Kadapa District people

కడపలో ఎయిర్ పోర్టును నిర్మించామని, ప్రాణాలు తీసేసే వాళ్ల ప్రాంతంలోనూ తాము (కేంద్ర ప్రభుత్వం) ఎయిర్ పోర్టులు కట్టించామని తాను అన్న వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప, కడప ప్రజలను కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రజలకు, హత్యారాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. విశాఖలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎయిర్ పోర్టులు నిర్మిస్తాం అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించానని సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. ఎయిర్ పోర్టుల సంగతి మేం (కేంద్రం) చూసుకుంటాం గానీ, ముందు మీరు రోడ్లు వేసుకోండి అంటూ హితవు పలికానని తెలిపారు. ఈ సందర్భంగానే తాను పైవ్యాఖ్యలు చేశానని, సొంత బాబాయిని చంపినవారికి శిక్షలు పడకుండా సీఎం జగన్ రక్షిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగానే మాట్లాడానని పేర్కొన్నారు.

తాను మాట్లాడింది కొందరు వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని మాత్రమేనని, తన మనసులో కడప జిల్లా ప్రజలపై ఎలాంటి దురభిప్రాయంలేదని అన్నారు. తనకు కడప జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు, సంస్కృతీ సంప్రదాయాలు, నమ్మితే ప్రాణమిచ్చే తెగింపు బాగా తెలుసని వెల్లడించారు. ఈ విషయంలో కడప జిల్లా ప్రజలకు మరెవరూ సాటిరారని సోము వీర్రాజు కొనియాడారు.

కడప జిల్లా ప్రజలకు మోసం చేయడం తెలియదని, కానీ సీఎం జగన్ కుటుంబాన్ని ఆదరిస్తూ పదేపదే మోసపోతుంటారని తెలిపారు. కడప జిల్లా ప్రజలు ఇకనైనా వారి మాయ నుంచి బయటపడి అభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటున్నానని అన్నారు.

కడప జిల్లాకు ఎయిర్ పోర్టుతో పాటు అనేక జాతీయ రహదారులను నిర్మించింది కేంద్ర ప్రభుత్వమేనని, వెనుకబడిన జిల్లా కింద కడపకు వందల కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తోంది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని సోము వీర్రాజు ఉద్ఘాటించారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కడప జిల్లా ప్రజలను అభ్యర్థిస్తున్నాను అంటూ వీడియో సందేశం వెలువరించారు.

More Telugu News