కడప జిల్లా ప్రజలు హత్యలు చేసేవాళ్లలా కనిపిస్తున్నారా?: సోము వీర్రాజుపై శ్రీకాంత్ రెడ్డి ఫైర్

28-01-2022 Fri 16:42
  • సోము వీర్రాజు వ్యాఖ్యలు వివాదాస్పదం
  • సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్న శ్రీకాంత్ రెడ్డి
  • గతంలో చంద్రబాబూ ఇలాగే మాట్లాడారని ఆరోపణ
  • సోము క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్
Srikanth Reddy fires on Somu Veerraju
నిన్న విశాఖలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. కడపలో తాము ఎయిర్ పోర్టు కట్టించామని, ప్రాణాలు తీసేవాళ్ల ప్రాంతంలోనూ ఎయిర్ పోర్టులు నిర్మించామని సోము వీర్రాజు అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి భగ్గుమన్నారు. కడప ప్రజలు హత్యలు చేసేవాళ్లు అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు గర్హనీయం అన్నారు.

సోము వీర్రాజు కడప జిల్లా ప్రజల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. రాయలసీమ సంస్కృతి తెలియకపోతే చరిత్ర చదవాలే తప్ప, ఇలా సిగ్గులేకుండా మాట్లాడరాదని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా కడప రౌడీలు, గూండాలు అని మాట్లాడారని ఆరోపించారు. కలెక్షన్ల కోసం సినిమాల్లో ఫ్యాక్షన్ ను చూపిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

ప్రతి ఒక్కరినీ గౌరవించే నైజం కడప ప్రజల సొంతమని, తమ కడుపు కాల్చుకుని ఎదుటివాళ్ల కడుపు నింపే తత్వం కడప ప్రజలదని వెల్లడించారు. క్రైమ్ ఎక్కువగా ఎక్కడ ఉందో పోలీస్ రికార్డుల్లో చూడాలని హితవు పలికారు. సోము వీర్రాజు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కడప జిల్లా ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.