ఉద్యోగుల ఆందోళనకు సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం: ఏపీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు

28-01-2022 Fri 16:39
  • ప్రభుత్వం ఇస్తున్నది పీఆర్సీ కాదు... రివర్స్ పీఆర్సీ
  • ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించాం
  • ఉన్న సౌకర్యాలు కూడా కోల్పోతున్నాం
APSRTC employees supports AP employees protests
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చబోతున్నాయి. పీఆర్సీతో పాటు పలు ఇతర అంశాలపై ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు పూర్తి మద్దతు పలకాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలిపాయి. ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు సంఘాల నేతలు తెలిపారు.

 ఈ రోజు విజయవాడలో వారు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు పలుకుతున్నామని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామని... అయితే, విలీనానికి ఎందుకు అంగీకరించామా? అని ఇప్పుడు అనుకుంటున్నామని తెలిపారు.

 ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల తమకు జరిగిన మేలు ఏమీ లేదని అన్నారు. ఉన్న సౌకర్యాలు కూడా కోల్పోతున్నామని... తాము కోరుకున్న విలీనం ఇదేనా? అనే చర్చ ఆర్టీసీ కార్మికవర్గాల్లో జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం ఇస్తున్నది పీఆర్సీ కాదని, రివర్స్ పీఆర్సీ అని... దీని వల్ల జీతాలు తగ్గిపోయే పరిస్థితి తలెత్తిందని అన్నారు.