ఇవాళ కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మమ్మల్ని కలిశారు: సజ్జల

28-01-2022 Fri 15:29
  • పీఆర్సీపై పీటముడి
  • తన నిర్ణయానికే కట్టుబడి ఉన్న ప్రభుత్వం
  • తమకు ఆమోదయోగ్యం కాదంటున్న ఉద్యోగులు
  • చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం అంటున్న సజ్జల
Sajjala invites employees union reps for talks
చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినా, ఉద్యోగులు ముందుకు రాకపోవడం సరికాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల్లో అపోహలు మరింత పెరగకూడదనే ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిందని అన్నారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని హితవు పలికారు.

ఇవాళ కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ వద్దకు వచ్చారని, తమ సమస్యలను వివరించారని సజ్జల తెలిపారు. వారు ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్నామని, వాటిపై చర్చిస్తామని వారికి తెలిపినట్టు వెల్లడించారు. మిగిలిన ఉద్యోగ సంఘాలకు చెందినవారు కూడా రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 3న లక్షమందితో 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కృతనిశ్చయంతో ఉన్నారు.